నా వయసు 25 ఏళ్లు. ప్రభుత్వోద్యోగం వచ్చింది. నచ్చినవాడిని నువ్వే సెలక్ట్ చేసుకుని మాకు చూపిస్తే పెళ్లి చేస్తామని మా పేరెంట్స్ నాకు స్వేచ్చనిచ్చేశారు. ఇక అప్పట్నుంచి నాకు నచ్చేవాడి కోసం వెతుకుతున్నాను. నాకు ఎవరైనా నచ్చారా అనుకుంటే వారంతా నా స్నేహితురాండ్ర ప్రియులే అవుతున్నారు. అంతేకానీ... వేరే మగాడు ఎవ్వరూ నాకు నచ్చడం లేదు. ఎవరైనా తారసపడినా వాళ్లతో కొద్దిసేపు మాట్లాడగానే కంపరం పుడుతోంది. ఇలాగైతే నాకు నచ్చినవాడు దొరికేదెప్పుడు నేను పెళ్లి చేసుకునేదెప్పుడు...?
నచ్చినవాడు... మీ స్నేహితురాళ్లు మీతో చాలా చనువుగా ఉంటారు. వారి ప్రియుల గురించి చాలా మంచిగానే చెపుతుంటారు. ఇంకా తమతమ లవర్స్ లో ఏవైనా నెగటివ్ షేడ్స్ ఉన్నా కప్పేసి చెప్పడం చాలామంది చేస్తుంటారు. ఇది మగవారు కూడా చేస్తూనే ఉంటారు. మరీ రచ్చకెక్కినప్పుడు మాత్రమే తేడాలు బయటకు వస్తాయి. అంతేతప్ప ముందుగా అందరూ మంచివారిగానే కనబడుతుంటారు. అలాగే మీ స్నేహితురాళ్ల ప్రియులు విషయమూ అంతే. అలాగని చెడ్డ లక్షణాలుంటాయని కాదు.
ఇకపోతే... మీకు తారసపడుతున్న పురుషులతో మీరు మాట్లాడేది, చర్చించేది చాలా తక్కువే ఉంటుంది. ఎవరో చెబితే తప్ప మీకు మీరుగా ఫలానా వ్యక్తి మంచివాడని తెలుసుకోలేరు. నచ్చినవాడిని మీరు ఎంపిక చేసుకోలేనట్లయితే తల్లిదండ్రులకే ఆ పని అప్పజెప్పండి. తప్పకుండా మంచివాడిని తెచ్చి పెళ్లి చేస్తారు.