దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీ ప్రజలు శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ 347గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఇది చాలా ప్రమాదకరంగా అభివర్ణించింది. అంటే వెరీ పూర్ కేటగిరీగా పేర్కొంది. ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు దీపావళికి గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా, గత యేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈ దపా కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
సోమవారం దీపావళి సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా 'వెరీ పూర్' కేటగిరీలో నమోదైనట్లు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) వెల్లడించింది. టపాసుల మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఇలాంటి కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీపీసీబీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీన సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. సాధారణ టపాసులపై పూర్తి నిషేధం విధిస్తే అక్రమ రవాణా పెరిగి, మరింత హానికరమైన వాటిని కాలుస్తారని, అందుకే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఇస్తున్నామని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కాలుష్య తీవ్రత తగ్గకపోవడం గమనార్హం.