సాధారణంగా మనిషి ప్రతికూల దృక్పథంతోనే ఆలోచిస్తుంటాడు. ఇలా ప్రతిసారి ప్రతికూల దృక్పథంతో ఆలోచిస్తే మానసికంగానేకాక శారీరకంగా కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి ఎల్లప్పుడు సానుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) తో ఆలోచించేలా మనిషి తనను అలవర్చుకోవాలి. దీంతో మానసికంగా, శారీరకంగానే కాక ఆర్థికంగా కూడా ఎంతో లాభదాయకమని పరిశోధకులు పేర్కొంటున్నారు.
* మిమ్మల్ని ఎల్లప్పుడు చైతన్యవంతులను చేసేది మీ ఆలోచనలే, అవి సానుకూలంగావుంటే మీ విజయానికి ఓ చక్కటి ఔషధంలా పని చేస్తుంది.
* ప్రతి రోజూ శారీరకంగా శ్రమించేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. అది మిమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది.
* మీరు ఏ పని తలపెట్టినా అందులోనున్న కష్ట-నష్టాలను ముందుగానే ఊహించి దానికి తగ్గ (పాజిటివ్) సానుకూల ధోరణిని అలవరచుకోండి. అదే మిమ్ములను విజయమార్గం వైపు తీసుకు వెళుతుంది.
* సానుకూల దృక్పథంతో ఆలోచించే వారితోనే స్నేహం చేయండి. దీంతో మీలోవున్న ప్రతికూల(నెగెటివ్ ఆలోచన) ధోరణి కూడా తగ్గుముఖం పట్టే అవకాశంవుంది.
* మిమ్మల్ని ఉత్సాహపరిచే, మీలో ఆలోచనను రేకెత్తించే పుస్తకంలోని కనీసం రెండు పేజీలు (రోజుకు) చదవడానికి ప్రయత్నించండి.
*యాంత్రికమైన తాత్కాలిక సుఖాన్నిచ్చే వస్తువులు...టీవీ, టెలిఫోన్, సెల్ఫోన్, పత్రికలు, మ్యాగజైన్‌లు, నవలలకు గంటల తరబడి అతుక్కుపోకండి. దీనివలన సమయం వృధా కావడమే కాక మానసిక బలహీనతకు లోనయ్యే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు తమను తాము అభివృద్ధి పరచుకోవడానికి ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి మంచి సానుకూల దృక్పథాన్ని (పాజిటివ్ థింకింగ్) అలవర్చుకోండి.