శివుడు అభిషేక ప్రియుడు. భక్తులు శివరాత్రి రోజున లక్ష బిల్వార్చన చేసి, భక్తితో పూజించి, అభిషేకిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారు. పంచాక్షరీ మంత్ర జపంతో పునీతులవుతారు. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. శివరాత్రి మహాత్మ్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది.
కాశీలో ఉండే సుస్వరుడు అనే బోయవాడు ఒకరోజు అడవిలో దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షం దగ్గరకు చేరుకుంటాడు. ఆ రోజంతా నిద్ర పోకుండా తన కోసం ఇంటి దగ్గర ఎదురుచూసే భార్య, పిల్లలను తలచుకుని బాధపడుతుంటాడు.
ఆ రాత్రి ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియక బిల్వ వృక్షం కొమ్మలకు ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తుంటాడు. ఆ ఆకులు చెట్టు కింద ఉన్న శివలింగపై పడతాయి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నుస్వరుడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివుడి సన్నిధికి చేరుకుంటాడు.
బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి. ఆ రోజు రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా, తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల అతను శివసాయుజ్యం చేరుకున్నాడు. అలా బోయవాడు శివరాత్రి మహాత్మ్యం తెలియకపోయినా యాదృశ్చికంగా జరిగిన పూజా ఫలాన్ని పొందాడు.