వ్యాసుడు బదరీ ద్వీపంలో పుట్టినందువలనే ఆయనకు బాదరాయణుడనే పేరు వచ్చింది. శాస్త్ర గ్రంథాలలో కూడా ఈ బదరీవృక్షం అత్యంత ప్రసక్తికరమైనది. ఈ బదరీ చెట్టు పండ్లలోనే కాదు, ఆకులలోను, బెరడులోను, చివరకు గింజల్లో కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మందమతులుగా ఉన్న పిల్లలచేత ప్రతిరోజూ రేగుపండ్లను తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట.
అంతేకాకుండా ఈ బదరీ ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటిపై కూడా పూతలా వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చును. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా కూడా వండుకుని తింటుంటారు. అలానే ఈ రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి వంటకాలు కూడా తయారుచేసుకోవచ్చును.