పురాణాలు, వేదాలకు భారతదేశం పుట్టిల్లు. అనేక సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భిన్నసంస్కృతులు భారత్ సొంతం. ఇక ఆలయాలకు చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెన్నైలోని కాళికాదేవి ఆలయం. తమిళనాడు రాజధాని చెన్నై తంబుచెట్టి వీధిలోని ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువున్న కాళికాదేవి శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3న ఈ దేవాలయంలోని అమ్మవారిని ఛత్రపతి శివాజీ దర్శించి పూజలు చేసిన తర్వాతే పలు యుద్ధాల్లో విజయం సాధించాడు.
కొన్ని శతాబ్దాల కిందట ఈ ఆలయం సముద్ర తీరాన ఉండేది. అయితే 1640లో దీన్ని ఈ ప్రాంతానికి తరలించారు. మళ్లీ 1678లో శివాజీ ఈ దేవాలయాన్ని పునరుద్దరించాడు. దేవాలయంలోని అమ్మవారిని శాంత స్వరూపానికి ప్రతీకగా పేర్కొంటారు. తమిళులు కామాక్షిగా కొలుస్తారు. ఇందులో మహావిష్ణువు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతోపాటు అగస్త్యుడు, అంగీరస మహర్షి విగ్రహాలు కూడా ఉన్నాయి.