విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే.. ముక్కంటి అభిషేక ప్రియుడు. అదే హనుమంతుడైతే.. స్తోత్ర ప్రియుడు. "శ్రీరామ జయ రామ. జయ జయ రామ" అనే స్తోత్రాన్ని పఠిస్తే.. ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. శ్రీరామ జయరామ.. జయ జయ రామ అనే స్తోత్రాన్ని రోజుకు 21సార్లు పఠించినట్లైతే.. హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పంచముఖ హనుమంతుడిని పూజించడం ద్వారా కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. వివాదాలు దూరంగా ఉంటాయి. వ్యాధులు నయమవుతాయి.
జ్యోతి స్వరూపమైన హనుమాన్‌ను పూజించడం ద్వారా కుటుంబంలోని ఈతిబాధలు తొలగిపోతాయి. హనుమన్నను పూజిస్తే.. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళ, శనివారాలను ఎంచుకోవడం మంచిది. ఈ రెండు రోజుల్లో హనుమాన్ ఆలయానికి వెళ్లి.. హనుమాన్ చాలీసా, రామచరితంను పఠించాలి. అంతేగాకుండా రామనామ పారాయణం చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి.
తమలపాకుల ఆకులను ఎందుకు సమర్పించాలంటే?
అశోక వనంలో హనుమంతుడు సీతాదేవిని దర్శించుకుని రాముని వివరాలను ఆమెతో చెప్తాడు. ఇలా అశోక వనంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రామునికి చేరవేసేందుకు బయల్దేరే సమయంలో హనుమంతుడు.. ఆ వనంలో పుష్పాలు చేతికి అందకపోవడంతో తమలపాకును ఆయన తలమీద వుంచి పుష్పాలుగా భావించి ఆశీర్వదిస్తుంది. ఇంకా సీతమ్మ అన్వేషణను విజయవంతం చేయడంతో.. సీతమ్మ ఆశీర్వాదం అతనికి లభించింది. అందుకే హనుమంతునికి మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి తమలపాకుల ఆకులను సమర్పించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అలాగే సీతమ్మ వారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో వస్తూనే ఆకాశంలో గట్టిగా హుంకరించాడు. ఆ ధ్వనికే మహేంద్ర గిరిపై ఆయన రాకకై ఎదురుచూస్తున్న వానరులు ఉబ్బితబ్బిబైపోయారు. తప్పకుండా ఆంజనేయుడు సీతమ్మను దర్శనం చేసుకుని వుండవచ్చునని భావించి... హనుమకు తమలపాకు తీగలతో చేసి సన్మానం చేశారు. దానికి ఆయన పరమానందభరితుడైనాడు. అదే ఆనందాన్ని మనం పూజ ద్వారా పొందాలని తమలపాకు మాలను స్వామివారికి సమర్పిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.