కుడి చేత్తో నాలుక, ఎడమ చేత్తో మర్మావయం పట్టుకుని...

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:27 IST)
నాలుగు యుగాలలో మూడు యుగాలు దాటుకుని ప్రస్తుతం మన కలియుగంలో వున్నాము. ఈ కలియుగంలో ధర్మం అనేది కించిత్ కూడా కనబడదనీ, అధర్మం నాలుగు పాదాలు ఆక్రమించుకుంటుందని చెప్పబడింది. పైగా ఈ కలియుగంలో చెడు బీజం సూది మొనలో ఎవరి మనసులోనైనా కలిగితే దాన్ని మహావృక్షం స్థాయికి తీసుకుని వెళ్లడంలో కలి పురుషుడు సిద్ధహస్తుడని చెప్పబడింది. అధర్మంగా వుండేవారిని పీడించాలని బ్రహ్మ, కలి పురుషుడిని ఆదేశించాడు.
 
కుడి చేత్తో నాలుక, ఎడమ చేత్తో మర్మావయం పట్టుకుని చూసేందుకే భీతి కలిగేలా వున్న కలి, బ్రహ్మను చూసి తను చేసేవన్నీ చెడ్డ కార్యాలేననీ, అలాంటి తనను భూలోకంలోకి వెళ్లమంటున్నారేమిటి దేవా అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మదేవుడు సమాధానం ఇస్తూ... కలి కాలం 4,32,000 సంవత్సరాలనీ, ఈ కాలంలో ఎవ్వరైతే చెడు మార్గాన్ని అవలంభిస్తారో వారిని అంతం చేయమన్నాడు. అలాంటి వారు భూలోకంలో నీకు కనబడితే ఆవహించాలన్నాడు.
 
అప్పుడు కలి చెపుతూ... తను ఉత్తమ దశను పొందకుండా చూసేవాడిననీ, నిద్ర, కలహం అంటే తనకు ఎంతో ఇష్టమనీ, పరస్త్రీ సాంగత్యాన్ని ఇష్టపడేవాడననీ, వేద శాస్త్రాలను నిందించేవారంటే తనకు ప్రీతి అనీ, ఎల్లప్పుడూ అబద్ధాలు, అరాచకాలు చేసేవారంటే తనకు ఇష్టమనీ... ఇలా అన్నీ వ్యతిరేకమైనవి బ్రహ్మకు వివరిస్తాడు. అప్పుడు బ్రహ్మ... కలీ... ధర్మం ఆచరించేవారివి విడిచిపెట్టు, కాశీలో నివశించేవారిని వదిలేయ్, తులసి, గోవును పూజించేవారిని, గురువును పూజించేవారిని, దైవభక్తితో ఎల్లప్పుడూ సత్యమునాచరించే వారి జోలికి వెళ్లకు, చెడ్డ స్వభావముతో వున్నవారిని ఆవహించి వారి పతనాన్ని చూడమని చెప్పాడు. అంతే.. కలి భూలోకానికి పయనమయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు