పోలేరమ్మ తల్లిని పిలిచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి: అందరి ముందుకు వచ్చి నైవేద్యం స్వీకరించిన దేవత

సిహెచ్

శుక్రవారం, 31 అక్టోబరు 2025 (17:14 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శిష్య సమేతంగా కడపను వీడి, ప్రొద్దుటూరు మీదుగా అల్లాడపల్లె చేరి, అక్కడ వీర భద్రుని దర్శించుకుని, అరణ్య మార్గం గుండా పుష్పగిరి బయలుదేరారు. మార్గమధ్యాన దోపిడీ దొంగలున్నారని పలువురు చెప్పినా వినక ఆ మార్గాన్నే  ప్రయాణము కొనసాగించారు. కీకారణ్యములో పోతుండగా గజదొంగలు బండినడ్డగించారు. బండి వాడిపై దాడిచేయబోగా, అయ్యా నాదగ్గర ఏమున్నది పొట్ట కూటికోసం బండినడుపుకునే వాడిని, లోపల జ్ఞాన ధనంతో తులతూగుతున్న స్వామివారు వేద సంపదతో కూర్చున్నారు. వారి వద్ధ మీకు కావలసినంత సంపద దొరుకుతుంది అనగా, ఓరీ! అసందర్భ ప్రేలాపీ, తప్పుకో లోపలున్నోడి అంతు చూస్తాం అని బండి వాడిని క్రిందకులాగిపడేసి, వచ్చిన తొమ్మిది మంది దొంగలూ మూకుమ్మడిగా లోపలికీ చొరబడ్దారు. ఎంత గలాట జరుగుతున్నా కదలకమెదలక స్వామివారు నిశ్చలంగా కూర్చున్నారు.
 
పెద్ద యోగిలా నటిస్తే వదిలేస్తామని కపట వేషం వేసాడు, ఇలాంటి వాడి దగ్గర తప్పక పెట్టెలో చాలా డబ్బు ఉంటాది. వాడ్ని పడేస్తే మొత్తం కొల్లగొట్టొచ్చు  అని కూడబలుక్కుని స్వామివారిని కొట్టడానికి దొంగలందరూ ఒకేసారి కర్రలు పైకెత్తారు. ఎత్తిన చేతులు ఎత్తినట్లే కర్రలతో పాటు దొంగలందరూ బిగుసుకుకుపోయారు.  వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్క అవయవంకూడా అంగులమైనా కదపలేక పోయారు. స్వామివారు మందహాసం చేస్తూ నాయనలారా! ఇంట్లొ మీ భార్యాపిల్లలు మీకోసం ఎదురుచూస్తుంటారు. ఆలస్యమయితే ఎవరేమి చేసారోనని భయపడతారు. వేగంగా నా దగ్గరి ధనాన్ని దోచుకుపోయి వాళ్లకు భయం లేకుండా చేయండి అన్నారు. అంతట వారు తలపెట్టిన తప్పు తెలుసుకుని, వేడుకోవడానికి నోరు కూడా కదపలేక కల్లoట నీరు జలజలా కార్చసాగారు. కొంతసేపటికి దొంగలకి బుద్దొచ్చిందని తలచి వారి బంధాలని విభూది జల్లి తొలగించగా, అందరూ స్వామివారి కాళ్ళపైపడి తప్పు క్షమించమని వేడుకొని, ఇకపై దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకుతాని మాటిచ్చారు. స్వామివారు వారిని రుజువర్తనులుగా మార్చి చీకుచింతా లేని జీవితం గడపండని దీవించి పుష్పగిరి వైపు ప్రయాణం కొనసాగించారు.
 
వీరబ్రహ్మేంద్రస్వామివారు అగ్రహారము గుండా పయనించుట:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎడ్లబండి, భక్తులు జయజయధ్వానాలు పలుకుతుండగా పుష్పగిరి అగ్రహారం లోనికి ప్రవేశించింది. కొంతదూరం వెళ్ళేసరికి వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడి బ్రాహ్మణులు అడ్డుకున్నారు. ఊరేగింపు ఆగడంతో స్వామివారికి వింధ్యామర సేవ చేస్తున్న సిద్దయ్య ముందుకు వచ్చి, వారి వద్దకు వెళ్లి, అయ్యా మా స్వామివారి ఊరేగింపును ఎందుకడ్డుకున్నారు? తమరెవరు ? అని అడుగగా, వాళ్ళు చెప్పలేనంత కోపముతో ఊగిపోతూ, మా అగ్రహారానికి వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తున్నావా. ఇంతకీ నువ్వెవరివో చెప్పు అని గద్దించారు. నన్ను సిద్దయ్య అంటారు. నాది దూదేకుల కులం అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానం విన్నంతనే అక్కడ ఉన్న వైదికబ్రాహ్మణుడొకడు, ఒళ్లంతా బూడిద పూసుకుని, రుద్రాక్షలు మెడకి వేలాడదీసినంత మాత్రాన బ్రాహ్మణుడివైపోతావా.

పరమతంలో పుట్టి మా మతాన్ని భ్రష్టుపట్టించడానికి వచ్చావా! నిన్ను కాదు, నీలాంటి మూకనెంటపెట్టుకొని వచ్చిన లోపల నక్కి కూర్చున్న పెద్దమనిషిని అనాలి. బ్రాహ్మణులకి కాక వేదాధ్యయనానికి ఇంకెవ్వరికీ అధికారము లేదు అని ఘీంకరించాడు. దానికి సిద్దయ్య బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో ఛండాల ఏవచ ద్రృడాభ్యాసే కరో నిత్యం పునర్జన్మ న విద్యతే. ఈ శ్రుతిననుసరించి ఏ కులమువాడైనా ధ్రృఢనిష్ఠాగరిష్టుడై, భగవంతుని స్మరణ, సంకీర్తనా చేయవచ్చనే కదా సారము అని వినయముగా బదులిచ్చాడు. అది విన్న బ్రాహ్మణులు మరింత ఉద్రిక్త భరితులై, ఓయీ వీరబ్రహ్మం! బయట ఇంత గలాటా జరుగుతున్నా, లోపల నక్కి కూర్చున్నావేం, బయటకురా అని కేకలేయసాగారు.
 
వీరబ్రహ్మేంద్ర స్వామివారు చిరునవ్వుతో బయటకు వచ్చి, ఇది మీ అగ్రహారం కాబట్టి, మిమ్ములను సమాధానపరచకుండా ముందుకెళ్లడం సబబు కాదు. మీ వాదనలంతా విన్నాము. బ్రహ్మ ముఖము నుండి పుట్టినందుకు మీరు అగ్రులు, తక్కిన వారు అధములు, వేదాధ్యయనమునకు పనికిరారని మీ వాదన. మీరు భావిస్తున్న మీ మూలపురుషుడైన బ్రహ్మ, విష్ణువు నాభి నుండి జన్మించాడు. బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్టుడు చండాలిని వివాహమాడగా జన్మించిన శక్తికి కుమారుడైన పరాశురుడు, మత్స్యగంధిని మోహించగా పుట్టిన వాడు వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు. ఇలా సంకరమై ఉన్నది.
 
జ్ఞాన విజ్ఞాన సంపన్న సంస్కారో వేదపారగః
విప్రో భవతి ధర్మాత్మా క్షత్రియుః స్వేనకర్మణాః
 
అనగా మానవునిగా జన్మలెత్తినవాడు ఎవడైనా జ్ఞాన, విజ్ఞాన సంపదలతో సంస్కారవంతుడైనచో బ్రాహ్మణునిగా పరిగణింపబడతాడనికదా సారము. బ్రాహ్మణత్వమునకు అధికారము జ్ఞానమే కానీ జన్మము కాదని మహాభారతము శాంతి పర్వములో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు ఉన్నది కదా. దేహము నందు ప్రధానమైనది ముఖము, కనుక ముఖము నుండి పుట్టిన వారు ప్రధములని, భుజముల నుండి పుట్టినవారు మధ్యములని, ఉరువులనుండి పుట్టిన వారు అధములని, పాదముల నుండి పుట్టినవారు అధమాధములని మీ భావనగా నాకనిపిస్తున్నది. దేహము నందు అన్ని భాగములూ సక్రమముగా పనిచేయునప్పుడే కదా దేహము సురక్షితమైన దేహముగా పరిగణింపబడుతోంది. ఇలా పరిపరి విధాల స్మృతులు, పురాణాలను ఉదహరించి దైవము వద్ద అందరూ సమానమే అని వివరించగా కొంతమంది విప్రులు తర్కించ లేక చల్లబడ్డారు కొంతమంది మాత్రం వాదప్రతివాదములనవసరం అగ్రహారం గుండా అన్య కులస్తుల బండి ముందుకు సాగనివ్వమని మొండిపట్టు పట్టి కూర్చున్నారు.
 
ఇంతలో అగ్రహారంమునందు ఉత్తర భాగములో మంటలు చెలరేగి భీభత్సము సృష్ఠించనారంభించాయి. ఇది బ్రహ్మం గారి పనేనని బ్రాహ్మణోత్తములు భావించి, స్వామివారినడ్డగించి తప్పు చేసామని గ్రహించి, వీరబ్రహ్మేంద్రస్వామి వారిని వేడుకోగా, నాయనలారా! మమ్మలిని ఆశ్రయించిన వారు ఎంత దుర్మార్గులైనా మేలు చేస్తామని పలికి ఎగిసిపడుతున్న మంటలను అదుపులోనికి తీసుకు వచ్చారు. మంటల్లో నష్టపోయిన సంపదను మరల పొందునట్లు చేసారు. తదనంతరం అక్కడున్న విప్రులకు జీవులందరూ దేవుని చెంత సమానమేనని జ్ఞానబోధ చేసి జయజయధ్వానాల మద్య ఎడ్లబండినెక్కి ముందుకి కదిలారు.
 
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ దేశ సంచారములో భక్తులు ఇచ్చిన కానుకలతో తమ మఠములోని విగ్రహములకు సువర్ణ ఆభరణములు చేయించి అలంకరించారు. అట్లాగే రజితముతో దీపపు ప్రమిదలు, పంచపాత్ర, ఉద్దరిణి, శఠగోపం తదితర పూజా సామాగ్రిని వెండితో తయారు చేయించారు. ఆ వెండి పూజా సామాగ్రిని చూసి ఒక దొంగకి కన్ను కుట్టి కన్నం వేయాలన్న తలంపు కలిగింది. వీరబ్రహ్మంగారు దేశాటన చేస్తూ అనంతమైన సంపదను కానుకల రూపంలో సంపాదించి దానిని మఠము లోనే ఉంచారని భావించి, దానిని దొంగలిచాలన్న తలంపుతో స్వామివారి వద్ద భక్తుడిగా చేరాడు. దేశ సంచారమునకు స్వామి వారు వెళ్లేటపుడు మఠమును దోచుకోవచ్చని పన్నాగం పన్నాడు. అయితే స్వామివారు జీవ సమాధి అగుటకు నిశ్చయించుకొని ఇక బయటకు పోకుండా మఠము నందే భక్తులకు దర్శనమిస్తారని తెలుసుకుని, స్వామివారు మఠము కార్యక్రమములు ముగించుకుని ఇంటికి పోయి నిద్రించు సమయమున తన తోడు దొంగలను కలుపుకొని దోచుకోవడానికి పన్నాగాలు పన్నాడు.
 
ఒక రోజు స్వామివారు నిద్రకుపక్రమిస్తూ తన ముఖ్య శిష్యులు కొందరితో, మన మఠంలో ఒక చిత్రం జరగబోతుంది, అందరూ నిశ్చింతగా  ఉండండి అని పలికి నిద్రకుపక్రమించారు. అందరూ పడుకున్నారని నిశ్చయించుకుని వారిలో ఉన్న భక్తుడి రూపంలో చేరిన చోరుడు, నెమ్మదిగా లేచి అక్కడినుండి జారుకుని, బయట నక్కి ఉన్న తోడు దొంగలతో కలిసి మఠమునకు వెళ్ళాడు.
 
దొంగలందరూ కలిసి చప్పుడు లేకుండా గోడకు కన్నము చేసి లోపలికి దూరగా, అఖండ దీపం వెలుగులో అక్కడి వస్తు సంపదంతా  స్పష్టంగా కనిపించసాగింది. మంచి అవకాశం చిక్కిందని సంబరపడిపోతూ ఖజానా పెట్టె లోని ధనాన్ని, బంగారం మరియు వెండి ఆభరణాలను, దేవుళ్ళకు తొడిగిన బంగారు ఆభరణాలను మూటలుగా కట్టి, అందరూ కలిసి ఆమూటలను దొంగ భక్తుడి నెత్తికెత్తారు. మరునాడు తెల్లవారగా యధాప్రకారం కాలకృత్యాలు నిర్వహించుకుని భక్తులతో సహా వీరబ్రహ్మేంద్రస్వామి వారు మఠమునకు బయలుదేరుతూ, తనతోనున్న భక్తుల్లో ఒకరిని గ్రామ పెద్దలను మఠమునకు పిలుచుకురమ్మని పంపారు.
 
స్వామివారు, ఊరి పెద్దలు,శిష్యులు మఠమునకు చేరి తలుపులు తీయగా, కళ్ళు కనిపించక తప్పించుకునే దారి తెలియక రోదిస్తూ దొంగలు అందులో దేవులాడుతూ కనిపించారు. వారికి నాయకత్వం వహించిన దొంగ భక్తుడు కళ్ళు కోల్పోయి లబోదిబోమని దొర్లుతూ ఏడుస్తున్నాడు. వారిని గ్రామ అగ్రులకు చూపిస్తూ చూసారా! వారు ఎంత పాపమునకు ఒడిగట్టారో! దేవుని సొత్తునే దోచుకోదలచారు అని స్వామివారు అనడమే తడవుగా, పెద్దలందరూ వారిపై విరుచుకుపడ్డారు. దొంగలందరూ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకోసాగారు. దొంగలకు నాయకుడైన కపట భక్తుడు స్వామివారి పాదాలపై పడి దురాశతో మీవద్ద భక్తుడిగా చేరి మీ మఠాన్ని దోచుకోవాలని తలచి క్షమించరాని నేరం చేసాను. మరెప్పుడూ తప్పుడు మార్గంలో వెల్లనని స్వామివారి పాదాల చెంత తల బాదుకోనారంభించాడు.
 
దయార్ద్ర హృదయులైన వీరబ్రహ్మేంద్రస్వామివారు మనసు కరిగి, దొంగలకు బుద్ధి వచ్చినది మరి శిక్షించనవసరము లేదనీ పెద్దలకుచెప్పి వారి కళ్లపై విభూది చల్లగా దొంగలందరి కళ్లూ తెరుచుకున్నాయి, దొంగల నాయకుడికి కల్లు వచ్చాయి. దొంగలందరూ దొంగతనాలు మాని కష్టపడి బ్రతుకుతామని స్వామివారివద్ద శపధము చేసి సెలవు తీసుకున్నారు.
 
పోలేరమ్మ వారు స్వామివారింటికి వచ్చుట
కందిమల్లాయపల్లెలో మసూచివ్వాధి ప్రబలడంతో, ఆ వ్యాధి నుండి గ్రామస్తులను రక్షించడానికి స్వామివారి ధర్మపత్ని గోవిందమ్మ గ్రామదేవతయైన పోలేరమ్మకి పుర స్త్రీలందరిచేత నైవేద్యం పెట్టించాలని సంకల్పిచారు. స్త్రీలందరూ నిర్ణయించుకున్న ప్రకారం ఒక శనివారం రాత్రి ఊరివారందరితోపాటు గోవిందమ్మ గారు కూడా చద్ది చెయ్యడానికి అన్నం వండారు. ఆదివారం తెల్లవారగానే ఇల్లంతా అలికి, ముగ్గులు వేసి, మడితో మూడు రాళ్ళను తెచ్చి, వాటికి పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి, ఇంట్లో ఉన్న చల్ల కవ్వము వద్ద ఆ మూడు రాళ్ళను పేర్చి, మునుపటి రోజు రాత్రి వండి దాచిన చద్ది అన్నములో పెరుగు కలిపి ఆ చద్దిని విస్తట్లో పెట్టి తెచ్చి ఆ రాళ్ళ ముందు ఉంచి వాటికి సాంబ్రాణి ధూపం వేయుబోతుండగా వీరబ్రహ్మేంద్రస్వామి వారు వంటింట్లోకి వచ్చారు.
 
స్వామివారు  పసుపుకుంకుమలతో అలంకరించబడిన రాళ్ళను చూస్తూ, ఈ మూడు రాళ్ళకు నైవేద్యం పెట్టినంత మాత్రాన పోలేరమ్మకు చేరుతుందా అని పరిహాసమాడారు. దానికి మాత గోవిందమ్మ, ఊరిలో ప్రబలిన మశూచి రోగమును పారద్రోలడానికి అమ్మవారి కరుణ పొందాలన్న తాపత్రయంతో ఊరిలోని ఆడవారమందరమూ ఈ పూజా చేయడానికి పూనుకున్నాము అని అనునయించిరి. అయితే అమ్మవారిని మన ఇంటికి నైవేద్యము స్వీకరించడానికి ఆహ్వానిస్తాను. అన్ని ఏర్పాట్లు చెయ్యు. ఊరి వారందరినీ పిలువు. అని స్వామివారు అనడంతో, గోవిందమ్మ గారు మహదానందపరవశురాలై, చాలా రకాల నైవేద్యము తయారు చేయించి, ఊరిలోని వారందరికీ ఆహ్వానము పంపారు.
 
అమ్మవారు స్వామివారింటికి స్వయముగా విచ్చేసి నైవేద్యము స్వీకరిస్తారని తెలియడంతో ఊరిలోని పిన్నలు, పెద్దలు స్వామివారి ఇంటికి చేరుకున్నారు. అదే సమయమున కర్నూలు నవాబు, స్వామివారు త్వరలో జీవ సమాధి చెందుతారని తెలిసికొని దర్శనము చేసుకోవడానికి వచ్చాడు. వచ్చినవారందరినీ శిష్యులు తగురీతిన కూర్చోబెట్టారు.
 
మాత  గోవిందమ్మ ముందుగా అమ్మవారికి విస్తరి వేసి వడ్డీంచి, తరువాత అందరికీ విస్తర్లువేసి వడ్డించి స్వామివారికి ఆ విషయం విన్నవించుకున్నారు. అంతట స్వామివారు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి, అర్థనిమీలిత నేత్రాలతో అమ్మవారిని మనస్సున దర్శిస్తూ ఆవాహన చేసారు. పోలేరమ్మ సుందర యవ్వనవతి రూపంలో ప్రత్యక్షమై తనకు కేటాయించిన విస్తరి ముందు ఆశీనురాలైంది. నైవేద్యము స్వీకరించమని స్వామివారు చెప్పగా,  అమ్మవారు నైవేద్యము గ్రహించ సాగింది. అక్కడికి వచ్చిన వారందరూ నిశ్చేష్టులై, సంభ్రమాశ్చర్యాలకు లోనై ఉండిపొవడంతో, అమ్మవారికి సహపంక్తి ఇవ్వమని స్వామివారు చెప్పగా, అందరూ భోజనమారంభించారు.
 
అమ్మవారు నివేదన ఆరగించిన తదుపరి, స్వామివారివైపు చూడగా, కొద్దిరోజుల్లో మేము జీవసమాధికి పోతున్నాము. ఆ పిదప కొన్ని దినములకు మా రెండవ కుమారుడైన పోతులూరయ్యకు నీవొక ఉపకారము చేయవలసి వస్తుంది, గోవిందమ్మ ఎప్పుడు పిలిచిన అప్పుడు వచ్చి ఆ పని చేసీ పెట్టు. ఊరి వారందరినీ వ్యాధుల నుండి కాపాడుతూ చల్లగా చూసుకో అని చెప్పగా, అమ్మవారు అలాగే అన్నట్లు తల ఊపి, అందరివీ ఆశీర్వదించి అదృశ్యం అయ్యింది. ఊరిలో ప్రబలిన స్పోటక జాడ్యము మటుమాయమయింది. అందరూ పోలేరమ్మ దర్శనభాగ్యం కలిగించినందుకు వేనోళ్ళ స్వామివారిని కీర్తించి, అనుగ్రహం భాషణం విని సెలవు తీసుకున్నారు. (ఇంకా వుంది)
 
- కొమ్మోజు వెంకటరాజు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు