నీటితో దీపాలు వెలిగించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

ఐవీఆర్

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (22:59 IST)
కందిమల్లయపల్లెకు ఎనిమిది మైళ్ళ దూరంలో మడమాల గ్రామంలో పీరు సాహెబు, ఆదంబీ అనే ముస్లిం దంపతులకు జన్మించిన సిద్దయ్య చిరు ప్రాయము నుండే హైందవ ధర్మానికి ఆకర్షితుడయ్యాడు. ఏడు సంవత్సరాలకు చదువుకు పంపగా తోటి పిల్లలకు జీవహింస చేయరాదని, అసత్యం పలకరాదని, దొంగతనము చేయరాదని, గోమాంసము భక్షించరాదని, పరస్త్రీ మాతృసమానురాలని, ఇరుగుపొరుగు వారిని ప్రేమించాలని, దుర్మార్గపు పనులు చేయరాదని ఇలా నీతులు చెబుతుండేవాడు. పదునాలుగు సంవత్సరములు ప్రాయములో ఊరిలోని కొంతమంది భక్తులతో కలసి కందిమల్లయ్యపల్లెలొ ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామివారి దర్శనం చేసుకుని తనను శిష్యునిగా స్వీకరించమని అర్థించాడు.

స్వామి వారు నీవు దూదేకుల శాఖకు చెందిన తురుష్కునివి, నీ వాంఛను నీతల్లిదండ్రులు, మతపెద్దలు అంగీకరిచరు అని సిద్దయ్యనుద్దేశించి పలికారు. తన వాళ్ళకు నచ్చచెప్పుకుంటానని, ఆశ్రమములో ఉండి ధర్మమార్గము తెలుసుకుని ఆచరించే అవకాశము ఇవ్వమని ప్రాధేయపడడంతో స్వామివారు సమ్మతించి తన ఆశ్రమములో చేర్చుకున్నారు.
 
వీరబ్రహ్మేంద్రస్వామివారి తనయులైన గోవిందయ్య, పోతులూరయ్యలు సిద్దయ్య చేరికను నిరాకరించారు. తురుష్కులు హైందవ సాంప్రదాయం పాటిస్తే మతం మలినమైపోతుందని గర్హిoచారు. అంతట స్వామివారు, నాయనలారా! పంచేంద్రియాల ప్రభావమునకు లోనై అనేక వ్యామోహాలతో, పలు రోగాలతో, బాల్య, యవ్వన, వార్ధక్య జరాభారములతో కృశించి నశించే ఈ శరీరము శాశ్వతము కాదు. శరీరము చాలించిన తరువాత మరు జన్మ ఏమగునో మీకు తెలియునా? అశాశ్వతమైన ఈ శరీరము ధరించి ఇది నాది ఇది నీది- అను మోహభ్రాంతిని విడనాడాలి. ఎక్కువ తక్కువలనే కులమత ద్వేషము సద్గురు పదధ్యాన తత్పరులకు తగదు. చిన్మయానంద అన్వేషకులకు లౌకికడాంబికములు ఉండరాదు అని జ్ఞానబోధ చేసారు.
 
సిద్దయ్య కనిపించక తల్లడిల్లిపోతూ, వీరబ్రహ్మేంద్రస్వామివారివద్ద తమ కుమారుడు ఉన్నట్లు తెలుసుకుని, పీరు సాహెబు దంపతులు స్వామివారి మఠమునకు వచ్చి సిద్దయ్యను తీసుకెళ్లడానికి శతవిధాల ప్రయత్నించారు. ఎన్ని విధాల నచ్చచెప్పి చూసినా సిద్దయ్య మనసు మారలేదు. తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా వచ్చేయడం తగదని స్వామివారు గద్దించినా వినలేదు వినకపోగా తల్లిదండ్రులకు ధర్మభోధ చేసాడు. గత్యంతరం లేక పీరు సాహెబు దంపతులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
 
అనంతరం స్వామివారు సిద్దయ్యకి బ్రహ్మోపదేశం చేసారు. సిద్దయ్యను పద్మాసనమందు ఆశీనుడిని చేసి, తన అమృత హస్తములతో నాలుకపై బీజాక్షరాలు రాస్తూ, అతని చెవిలో ఓం, హ్రీం, క్లీం, శ్రీం, నమశ్శివాయ, శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః అను మంత్రమును ఉపదేశించి, నాయనా! ఈ మంత్రమును స్థిరచిత్తముతో జపించు. నేను చూపించబోయే లక్ష్యమును శ్రద్దగా గ్రహించు, అని బోదించి భ్రుకుటిపై అంగుష్ఠము నుంచి కన్నులను మూయించి లలాటమున ప్రకాశిస్తున్న పరంజ్యోతిని దర్శింపజేసారు.
 
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేశ సంచారము:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు భక్తిశ్రద్ధలకు మెచ్చి శిష్యుడైన శిద్దయ్యకు గురు-శిష్య తత్వము, వ్యామోహము త్యజించి జన్మ పావనమొనర్చుకొను మార్గము, కామ-క్రోధ-లోభ-మధ-మాత్సర్యాలు పెంచు దుర్గుణములు జయించుటకు కావాల్సిన సాధన విథానములు బోధించారు. స్వామి వారు మరల దేశ సంచారమునకు శిష్యులను వెంటబెట్టుకుని శ్రీ గురుపీఠముతో సహా బయలు దేరారు. మల్లెపల్లి, పోరుమామిళ్ళ, కలిసపాడు, గిద్దలూరు, కంభం, దొనకొండ, మార్కాపురం, నర్సారావుపేట, గుంటూరు, మంగళగిరి మీదుగా మార్గమద్యములో ప్రజల పూజలు స్వీకరిస్తూ, జ్ఞాన బోధ చేస్తూ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో ఐదు దినములుండి కనకదుర్గమ్మకు పూజలు సలిపి, తదనంతరము ఏలూరు, రాజమండ్రి, హైదరాబాదు మీదుగా సికింద్రాబాద్ నవాబు ఆహ్వానము మేరకు ఆతిథ్యము స్వీకరించి అనుగ్రహ భాషణము చేసారు.
 
అచట నుండి విశ్వబ్రాహ్మణులు పూల పల్లకిలో భాజాభజంత్రీలతో హైదరాబాదు లోని ప్రధాన రహదారులలో ఊరేగిస్తూ షట్ శాస్త్ర పండితుడైన ఒక విశ్వబ్రాహ్మణుని ఇంట ఏర్పరిచిన విడిది చేసి, అక్కడే అనుగ్రహభాషణము చేసి, భక్తుల సందేహములు తీర్చి, అందరితో సహపంక్తిబోజనము చేసారు. తదనంతరం అక్కడ భక్తులకు యోగసాధనలో లక్ష్యత్రయము ద్వారా బాహ్య, మధ్య, అంతర్ లక్ష్యములను సాధించు విధానము వివరించారు. హైదరాబాదు నవాబుకు స్వామివారి మహిమలు, వారు అందిస్తున్న భోధనామృతముల గురించి తెలియగా, షట్ శాస్త్ర కోవిదుడైన విశ్వబ్రాహ్మణుని పిలిపించుకుని స్వామివారి గురుంచి కూలంకషంగా తెలుసుకుని, తానే స్వయముగా స్వామివారి శక్తులను చూడదలచి, మేనాతో సహా భటులను పంపించారు.
 
వీరబ్రహ్మేంద్రస్వామివారు తన బసలో భక్తులకు జ్ఞానభోధ చేయుచుండగా, నవాబు దూత వచ్చి నవాబు యొక్క ఆహ్వానమును విన్నవించాడు. అయితే మీనాను అలానే ఉంచి భక్తులకు అనుగ్రహ భాషణం అయిన పిదపి, అనుష్ఠానం ముగించుకుని, భోజనకార్యక్రమము అయిన తరువాత కొంచెము విశ్రమించి, భక్తుల జయజయధ్వానాల మధ్య మేనాలో చేరుకున్నారు. నవాబు ఎదురు వచ్చి సగౌరవంగా సభలోనికి తీసుకుపోయి ఉన్నతాసనమున కూర్చుండబెట్టి సత్కరించారు. తదనంతరము ఒక చిన్న సందేహము. స్వామి అనగా, సందేహము తీర్చుకొనుటకు ఒక చెంబుడు నీళ్ళు పట్టుకుని తన విడిదికి రమ్మని చెప్పగా, స్వామివారి వెంట అదేవిధముగా బయలుదేరాడు.
 
స్వామివారు తన విడిదికి చేరుకున్న తరువాత పీఠము వద్ద వెలుగుతున్న దీపములను చూపుతూ, నాయనా! బ్రహ్మ జ్ఞాని అయినచో నీళ్ళ దీపమును వెలిగించగలవాడై ఉండాలన్నది నీ తలంపు కదా. నీవు తెచ్చిన నీటిని పీఠము వద్దనున్న ఏదో ఒక ప్రమిదలో పోసి వెలిగించుము లేదా నీవే ప్రమిదను, కొత్త వత్తిని తెప్పించి, నీవు తెచ్చిన నీళ్లతో వెలిగించు అనగా తన ఆంతర్యమును చెప్పకనే గ్రహించిన స్వామివారిని స్లాఘిస్తూ, కొత్త ప్రమిదలో, కొత్త వత్తి వేసి తనతో తెచ్చిన నీటిని వేసి వెలిగించగా, అది దేదీప్యమానముగా వెలిగింది. నవాబూ,అతనితో వచ్చిన పరివారమూ ఆనందసంభ్రమాశ్చర్యాలతో స్వామివారిని సేవించుకున్నారు. స్వామివారు నవాబుకు కాలజ్ఞాన బోధ కొంత కలిగించారు. (ఇంకా వుంది)
- కొమ్మోజు వెంకటరాజు
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు