మనలను రక్షించడానికే ఆ సాయినాధుడు

బుధవారం, 21 అక్టోబరు 2020 (23:26 IST)
కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము. ఆ కష్టం తొలగినపుడు భగవంతుడిని సంతోషంగా కొలుస్తాము. కాని ఆ సమస్య తీరనప్పుడు ఒక దేవతను వదిలి ఇంకొక దేవుణ్ణి, ఒక గురువును వదిలి ఇంకొక గురువును, ఒక సాంప్రదాయాన్ని వదిలి ఇంకొక సాంప్రదాయాన్ని ఆశ్రయిస్తుంటారు. కొంతకాలం ఆ క్రొత్తదనం వలన ప్రయోజనమున్నట్లనిపించినా, మరికొంత కాలానికి వారి సమస్య సమస్యగానే నిలిచిపోతుంటుంది. వీరిలో కొందరు అసలు సాధన, ఆధ్యాత్మికతలే వాస్తవం కాదనే దృష్టికొస్తారు. అలానే ప్రాపంచిక సమస్యల విషయంలోనూ జరుగుతూంటుంది.
 
 ఈ సమస్యకు కారణం మనం ప్రధానమైన ఒక సత్యాన్ని మరవడమే. ఇంద్రియాలకు, మనస్సుకు అతీతమైన పరమాత్మ ఉన్నాడనీ, తినడం, నిద్రపోవడం వంటి ప్రాకృతికమైన క్రియలకంటే జీవితానికి వేరొక పరమార్ధమున్నదని, దానిని పొందేందుకు సాధన ఒకటున్నదనీ మానవ జాతికి తెల్పినవారు లేకుంటే మనమంతా పశుప్రాయంగా జీవిస్తుండేవాళ్లమే. అలా తెల్పినవారిని సద్గురువులంటారు. భగవంతుని అస్ధిత్వాన్ని తాము ప్రత్యక్షంగా అనుభవించి మనకు నిస్సంశయంగా ఆ విషయాన్ని నిరూపించి, దానిని పొందే మార్గాన్ని స్వానుభవంతో బోధించేవారిని సద్గురువులు అంటారు.
 
 బ్రహ్మ జ్ఞానియైన సద్గురువును ఆశ్రయించి తీరాలని లోకానికి అవతార పురుషులు నొక్కి చెప్పారు. మన ఆచరించి తీరవలసిన మార్గాన్ని తన ఆచరణ ద్వారా చూపిన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుణ్ణి గురువుగా ఆశ్రయించాడు. తాను ఏ విధమైన యత్నంతోనూ పొందదగినదేదీ ముల్లోకాల్లోనూ లేదని భగవద్గీతలో చెప్పిన శ్రీ కృష్ణపరమాత్మ బాల్యంలో తన నోట చతుర్దశభువనాలనూ, యశోదకు దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షికి శిష్యుడై సేవించాడు.
 
అందుకు కారణాన్ని భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవే తరోజనాః. శ్రేష్టుడు దేనినాచరించినా, దానినే ఇతర జనులాశ్రయిస్తారు అని చెప్పాడు. కృష్ణుడు తాను ఆచరించి చూపడమే కాక ప్రాణప్రియుడైన అర్జునికి కూడా అలానే చేయమని చెప్తాడు.  గురువుని సేవించడం వల్ల మనం దేవతారాధన ఎలా చేయాలో, కర్మల నుండి ఎలా బయట పడాలో తెలుసుకోగలుగుతాము. మనం తెలిసి తెలియక చేసే కర్మల నుండి రక్షించడానికి సద్గురువు రూపంలో శ్రీ సాయినాధుడు అవతరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు