ఆ జాతరలో అమ్మవారిని బండబూతులు తిడితేనే అనుగ్రహిస్తుంది.. ఎక్కడ?

మంగళవారం, 7 మే 2019 (12:49 IST)
బూతుపురాణం.. నోటికి వచ్చిన తిట్లు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై. వినడానికే విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. ఇది ఎక్కడో కాదు ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన తిరుపతిలో. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని తిరుపతి వాసులు ఇప్పటికి పాటిస్తున్నారు.
 
పండగైనా జాతరైనా మనందరికీ ఒక్కటే. ప్రపంచం ఎన్ని ఆధునిక పోకడలతో పరుగులు తీస్తున్నా అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాలకు మన సమాజం ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. తిరుపతిలోని తాతయ్యగుంట వీధిలో కొలువై ఉన్న గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి చెల్లెలే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. యేడాదికి ఒకసారి ఏడురోజుల పాటు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. గంగమ్మ తల్లి జన్మదినమైన ఛైత్రమాసం చివరి వారంలో జరిగే ఈ జాతరను స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. స్తానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం ఈ జాతరకు వస్తారు.
 
గంగమ్మ జాతరకు పురాణ ఇతిహాసాల్లో గొప్ప చరిత్రే ఉంది. తిరుపతిని ఏడుగురు గ్రామదేవతలు కాపాడుతున్నారని ప్రతీతి. ఏడుగురు గ్రామదేవతలు తిరుపతి పొలిమేరల్లో కొలువై ఉన్నారు. వీరే పెద్ద గంగమ్మ, ముత్యాలమ్మ, అంకాళమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, మేరులమ్మ వీరిలో చిన్నదైన గంగమ్మ తల్లే తాతయ్య గుంట గంగమ్మ తల్లి. శ్రీ వేంకటేశ్వస్వామికి స్వయానా చెల్లెలు. తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుపతి గంగమ్మ గురించి గొప్పగా వర్ణించారు. 
 
పూర్వం కాలం తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారట. ఓ పాలేగాడి అరాచకాలకు ఎంతో మంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడ్డారని పురాణాలు చెబుతున్నాయి. పాలేగాడు శ్రుతిమించడంతో గంగమ్మ ఆ పాలేగాడి తన నరికి చంపుతుంది. పాలేగాడిని చంపిన రోజే గంగమ్మ జాతర జన్మదినం. పూర్వం పాలేగాడిని కనిపెట్టడానికి గంగమ్మ రోజుకో వేషంలో ఎలా అయితే సంచరించిందో భక్తులు కూడా అలాగే గంగమ్మ జాతరను రోజుకో వేషం ధరించి బూతు పురాణం వల్లిస్తారు. ఇలా బూతుపురాణం వల్లించడం వల్ల గంగమ్మతల్లి తమ కోర్కెలు తీరుస్తుందన్నది భక్తుల విశ్వాసం. 
 
గంగమ్మ జాతర ఈనెల 7వతేదీన ప్రారంభం కానుంది. 8వ తేదీ భక్తుల వేషధారణలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బైరాగుల వేషం.. చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ బైరాగుల అవతారం ఎత్తుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కనిపించిన వారినల్లా బండబూతులు తిడుతూ చిందులు తొక్కుతుంటారు. ఇదంతా గంగమ్మ తల్లి కృప కోసమని నమ్ముతారు నగర ప్రజలు. 
 
జాతరలో రెండవరోజు బండవేష ధారణ.. శరీరమంతా కుంకుమ రాసుకుని కాటుక బొట్టు పెట్టుకుంటుంటారు. తెల్లటి పువ్వులు.. బొరుగుల దండలు..బండ పూల దండలు మెడలో వేసుకుంటారు. ఈ జాతరలో ఐదవరోజు మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలెట్. పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యుటీషియన్లు సైతం వస్తుంటారు. స్త్రీ వేషం వేయడం వల్ల సాక్షాత్తు గంగమ్మతల్లితో పోల్చుకుంటారు భక్తులు. 
 
వైభవంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరకు తిరుమల నుంచి సారె రావడం ప్రతియేటా ఆనవాయితీ. పసుపు, కుంకుమలు, శేషవస్త్రాలతో కూడిన సారెను ఈసారి టిటిడి అధికారులు అందజేస్తుంటారు. నాగరిక ప్రపంచంలో సైతం అనాదిగా వస్తున్న ఆచారాలకు, సాంప్రదాయాలకు ఈ జాతర నిలువెత్తు సాక్ష్యం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు