ముస్లింల అల్లుడు తిరుమల శ్రీవారు - బీబీనాంచారమ్మను పెళ్లాడిన గోవిందుడు...

బుధవారం, 6 జులై 2016 (13:22 IST)
తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. సాక్షాత్తు స్వామివారికి రెండవ భార్య ముస్లిం. ఆమె పేరు బీబీ నాంచారమ్మ. కనకదుర్గకు ఈమె ఆడపడుచు. చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ముస్లింలు కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్‌ మిర్జా అనే ముస్లిం సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఉత్సవ దేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్‌ మీర్జా సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.
 
బీబీనాంచారమ్మ గురించి మరిన్ని వివరాలు... మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని ఢిల్లీ తీసుకెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవ సన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలిచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గాను, మాలిక్‌ కాఫూర్‌ గాను చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీ రంగంలోని శ్రీ రంగనాథ విగ్రహమని, మేళ్కోటలోని క్రిష్ణ విగ్రహమని, విగ్రహాన్ని సుల్తాను కూతురే తిరిగి తీసుకువచ్చిందని, రామానుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా పురాణాలు చెబుతున్నాయి.
 
అనాదిగా తిరుమల తత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. వెంకటేశ్వరుని పట్టపురాణిగా కీర్తించబడే అమ్మవార్లకు అలమేలుమంగ లేక పద్మావతిగా తమిళంలో ఆండాళ్‌, గోదాదేవిగా, శ్రీదేవిగా చెప్పుకుంటారు. స్వామి దేవేరిగా బీబీ నాంచారమ్మను కూడా భక్తులందరూ స్మరించుకోవడం పరిపాటి. బీబీ అనే పదం ముస్లింలకు సంబంధించిన ఉర్దూ బాషా పదం. నాంచారి అనేది తమిళ పదం. రెండింటి అర్థం భార్యే. బీబీ నాంచారి ప్రస్థావనకొచ్చేసరికి కొందరు వైష్ణవ పండితులు ఒక కథను ప్రస్థావించారు. 
 
ఒకప్పుడు మైసూరు చక్రవర్తి హైదరాలీ తిరుమల దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను వశపరుచుకున్నాడట. దారిలో ఉండే హిందూ దేవాలయన్నింటినీ నగలు, సంపదలతో సహా వశపరుచుకునేవాడట. కాగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి ఉద్యక్తుడవుతుండగా కొందరు తిరుమలకు వెళ్ళే యాత్రికుల తలనీలాలు, గడ్డం గుబురుగా పెంచుకుని గోవిందనామంతో వెళుతున్నారట. దానితో హైదరాలీ అక్కడి ప్రాంతం వారిని అడుగగా అది తిరుమల ఆచారమని, స్వామివారు బీబీ నాంచారి అనే ముస్లిం యువతిని పెండ్లాడారని భక్తులు స్వామివారి గౌరవార్థం జుట్టు గడ్డం పెంచుకుని వెళతారని.. స్వామిని దర్శించుకుని వచ్చేటపుడు తిరిగి తలనీలాలు సమర్పించుకుని బోడి గుండుతో వెళతారని చెప్పగానే హైదరలీ పశ్చాత్తాపపడి తమ మతానికి చెందిన బీబీ నాంచారి గౌరవప్రథంగా స్వామివారి సంపదను కొల్లగొట్టకుండానే తిరిగి వెళ్ళాడట.
 
తమ మతానికి చెందిన ఆడపడుచును హైదరలీ గౌరవించడంతో అప్పటి నుంచి ఏ యేటికాయేడు ముస్లింలు కూడా వేంకటేశ్వరుని కొలుచుకోవడం ఆనయితీగా వస్తోంది. అయితే 16వ శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనలలో ఎక్కడ కూడా బీబీ నాంచారి పేరు ప్రస్థావించకపోవడం గమనార్హం.
 
కడప జిల్లాలోని దేవుని కడపలో ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి యేటా ఉగాది రోజుల ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తమ ఇంటి ఆడబిడ్డ అయిన బీబీ నాంచారమ్మను చేసుకున్నందుకు ఆయన్ను తమ ఇంటి అల్లుడిగా భావించి ఇలా చేస్తున్నారు. బీబీ నాంచారమ్మకు ఉగాది రోజు పుట్టింటి సారెగా బియ్యం, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మిరపకాయలు, కూరగాయలను సమర్పిస్తారు. ఉగాది రోజున బీబీ నాంచారమ్మకు దినుసులు ఇచ్చి దర్శనం చేసుకుని తమ ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలని స్వామిని కోరుకుంటామని ముస్లింలు చెబుతుంటారు.

వెబ్దునియా పై చదవండి