కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే?

బుధవారం, 6 నవంబరు 2019 (22:15 IST)
కార్తీక మాసం అంటే శివునికి మహా ప్రీతి. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలు దర్శిస్తే శ్రేష్టమని చెప్తారు. అందులోను కార్తీక మాసంలో ఈ పంచారామాలను దర్శించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయి.
 
ద్రాక్షారామం :  పంచారామాలలో మొదటిదిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు సుమారు 60 అడుగులు. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పైఅంతస్తు నుంచి అభిషేకాదులు నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చిందని చెబుతుంటారు. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. ద్రాక్షారామము భోగానికి, మోక్షానికి, పావనానికి ప్రసిద్ధ పుణ్య క్షేత్రము.lord siva
 
అమరారామం: పంచారామాలలో అమరావతి రెండవది. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉంది. నవ్యాంధ్రకు భవ్యరాజధానిగా నిర్మితమవుతున్న అమరావతికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగతా 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. పైఅంతస్తు ఎక్కి అభిషేకము పూజలు చేయాలి. దేవాలయ ప్రాంగణములో 108 శివలింగములు కలవు అమ్మవారికి రాజ్యలక్ష్మి బాల చాముండిక అను పేరు కూడా కలదు. ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకము ప్రత్యేకత. ఈ లింగాన్ని దేవతల రాజయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం. అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు వచ్చిందంటారు. లింగము పెరుగుటచే చీల కొట్టారని అంతట పెరుగుదల ఆగిపోయిందని చెపుతారు. చీల కొట్టినపుడు రక్తము ధారగా కారినట్లు లింగముఫై కన్పిస్తుంది.
 
క్షీరారామం: క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఈ క్షేత్రం నరసాపురానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడి మహాలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ శివలింగం పాలవలె శ్వేతవర్ణంలో కనిపిస్తుంటుంది. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. క్షీరారామానికి ఆ పేరు రావడం వెనుక ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. పరమేశ్వరుడు స్వయంగా క్షీరపుష్కరిణిని అనుగ్రహించి క్షీర సముద్రం నుంచి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అలా ఈ క్షేత్రం క్షీరారామంగా పేరొందింది. కాలక్రమంలో పాలకొల్లుగా మారింది. ఇక్కడ 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు, లక్ష్మి జనార్దనులు, సరస్వతి బ్రాహ్మలు ఉన్నందున ఈ దేవాలయమునకు త్రిమూర్త్యాలయము అని పేరు. దీనిని హరిహర క్షేత్రమని పిలుస్తారు. లింగము తెలుపు రంగులో ఉంటుంది. ఇచట లింగమును దర్శించిన వారికి దారిద్ర్య బాధ కలుగదని ప్రతీతి.
 
సోమరామం: పంచారామాల్లో సోమారామం నాల్గవది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునుపూడిలో ఉంటుంది. ఇక్కడి స్వామివారిని ఉమాసోమేశ్వరునిగా పిలుస్తారు. ఈ శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేనాటికి ధవళకాంతులీనుతుంది. సోమేశ్వర లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం మూలానే ఇలాంటి ప్రత్యేకత సంతరించుకుందని చెబుతుంటారు. సోముడు ప్రతిష్ఠించిన లింగం ఉండటం చేత ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు స్థిరపడింది. ఈ లింగమును ప్రార్ధించిన వారికి సర్వ వ్యాధులు తొలగునని, పంచ మహా పాపములు హరిస్తాయని నమ్మకం.
 
కుమారారామం : పంచారామాల్లో చివరిది కుమారారామం. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. చాళుక్య రాజులలో ఒకడగు భీమునికి రాజధానిగా ఉండుటచే ఈ ప్రాంతమును భీమవరమని పేరు. శివుడు చాళుక్య భీమేశ్వరుడు, శివ కుమారుడయిన కుమారస్వామిచే పూజలందుకున్నది కావున కుమారారమమని పేరు వచ్చింది. దీనిని స్కంధరామమని కూడా అంటారు. అమ్మవారు శ్యామల దేవి. 14 అడుగుల ఎత్తున్న భీమేశ్వరలింగం భక్తులకు దర్శనమిస్తుంది. రెండతస్తుల మంటపం గల గర్భాలయం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు