ఆరు నెలలకు ఓసారి రంగును మార్చుకునే వినాయకుడు..

బుధవారం, 27 మార్చి 2019 (14:27 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. దానికి కారణం మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం. 
 
ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఇలా జరగడం దేవుని మహత్యం అని భక్తులు విశ్వసిస్తారు. అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ప్రాంగణంలో నీటి బావి ఉంది. దానిలోని నీరు కూడా ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతుంది. కానీ వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు నల్లగా, నల్లగా ఉన్నప్పుడు తెల్లగా ఉండటం విశేషం. 
 
వాటితోపాటు మరో విచిత్రం ఏమిటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి. కానీ దట్టమైన అరణ్యాల కారణంగా తమిళనాడు, కేరళకు చెందిన అరణ్యాలకు ఈ ఋతు బేధం వర్తించదు. ఈ ఆలయంలోని ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు. 
 
నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. పాత కాలంలో ఈ ఆలయంపై వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అందువలన దీనిని  అనేక మార్లు పునర్నిర్మించడం జరిగింది. దీనిపై కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆలయం తమిళనాడుకి చెందడంతో వారి ఆధిపత్యం తగ్గింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు