పద్మనాభ స్వామి ఆలయం మూసివేత... ఎందుకో తెలుసా?

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (14:03 IST)
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తాత్కాలికంగా మూతపడింది. దేశ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈ ఆలయంలోకి కూడా ప్రవేశించింది. అంటే, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు పెరియ‌నంబి స‌హా 12 మంది ఆల‌య సిబ్బందికి క‌రోనా వైరస్ సోకింది. 
 
దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని పాల‌క‌మండ‌లి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పాలక మండలి నిర్ణయం మేరకు పద్మనాభ స్వామి ఆలయం ఈ నెల 15వ తేదీ వరకు మూసివుంటుంది. అయితే, భ‌క్తుల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉండ‌ద‌ని, త‌క్కువ మంది సిబ్బందితో ఆల‌యంలో రోజువారి పూజా కార్య‌క్ర‌మాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపారు.
 
అయితే, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు పెరియ‌నంబి ఆల‌యానాకి వ‌చ్చేవ‌ర‌కు పూజా బాధ్య‌త‌లు చూసుకునేందుకు తంత్రి స‌ర‌న‌నెళ్లూర్ స‌తీష‌న్ నంబూతిరిప్ప‌డు తిరువ‌నంత‌పురం చేరుకున్నాడు. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఈ ఏడాది మార్చి 21 నుంచి కేర‌ళ ప‌ద్మ‌నాభస్వామి ఆల‌యాన్ని మూసివేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా ఆల‌యాలు తెరిచేందుకు అవ‌కాశం ఇవ్వ‌డంతో గ‌త ఆగ‌స్టు 27న ఆల‌యాన్ని తెరిచారు. ఇప్పుడు సిబ్బందికి క‌రోనా సోక‌డంతో మరోమారు తాత్కాలికంగా మూసివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు