అక్టోబరు కోటా టిక్కెట్లు 30 నిమిషాల్లో హుష్‌కాకి

శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:21 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే అక్టోబరు నెల కోటా కింద 8 వేల టిక్కెట్లను విడుదల చేసింది. ఈ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే మటుమాయమైపోయాయి. 
 
శ్రీవారి సర్వదర్శనం అక్టోబర్‌ నెల కోటా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. 
 
శుక్రవారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా.. ఊహించని రీతిలో అరగంటలోపే అవి ఖాళీ అయ్యాయి. రోజుకు 8 వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు.
 
గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని జియో సహకారంతో ఆ సంస్థ సర్వర్లను వినియోగించి టికెట్లను విడుదల చేశారు. తితిదే వెబ్‌సైట్‌కు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగినా సర్వర్లపై ఒత్తిడి పడకుండా వర్చువల్‌ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయించారు. 
 
టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ లేదా సింగిల్ డోస్ వ్యాక్సిన్ లేదా దర్శనానికి 72 గంటల ముందు పరీక్ష చేసుకున్న కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్లతో తిరుమలకు రావాలని తితిదే సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు