తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న స్మార్థ ఏకాదశి, ఫిబ్రవరి 8న వైష్ణవ మాధ్వ ఏకాదశి, ఫిబ్రవరి 11న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం, ఫిబ్రవరి 12న కుంభ సంక్రమణం, శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవారంభం, ఫిబ్రవరి 16న వసంత పంచమి, ఫిబ్రవరి 19న రథసప్తమి, ఫిబ్రవరి 23న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 24న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, ఫిబ్రవరి 27న కుమారధారతీర్థ ముక్కోటి ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
మరోవైపు, తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వహించారు.
ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను ఏకాంతంగా చేపట్టారు.
శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ మురళీకృష్ణ, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ సూర్యనారాయణ రాజు, ఇంజినీరింగ్, అటవీ, విజిలెన్స్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.