నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి ద్వార దర్సనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి. వైకుంఠ ద్వార దర్సనం 13వ తేదీ అర్థరాత్రి 2 గంటల నుంచి 22వ తేదీ అర్థరాత్రి వరకు ఉంటుందన్నారు. 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సామాన్య భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా జనవరి నెలలో దర్సన టిక్కెట్ల కోటాను పెంచలేకపోయామన్నారు. దర్సనం టిక్కెట్లు కలిగి కోవిడ్ లక్షణాలు ఉన్న భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. జనవరి 1వ తేదీ, జనవరి 13వ తేదీ నుంచి అలాగే 21వ తేదీ వరకు ప్రతిరోజు ఇరవై వేల సర్వదర్సనం టోకెన్లను ఆన్ లైన్లో ఉంచుతామన్నారు.
ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో స్థానికులకు టోకెన్లను కేటాయిస్తామన్నారు. తిరుమలలో 7,200 అద్దె గదులు ఉన్నాయని.. వాటిలో 1300 గదుల్లో మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. దీంతో వసతి సదుపాయం లభ్యత తక్కువగా ఉంటుందన్నారు.
వసతి లభ్యత దృష్ట్యా గదులు లభించని భక్తులు దర్సనం ముగించుకుని తిరుగు ప్రయాణం కావాలని విజ్జప్తి చేశారు. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజులు గదులు అడ్వాన్స్ బుకింగ్ రద్దు, అలాగే దాతలకు గదులకు కేటాయింపు రద్దు చేస్తున్నామన్నారు. జనవరి న్యూ ఇయర్, వైకుంఠ ద్వార దర్సనం ఉండే 13 నుంచి 21 తేదీల్లో విఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు. ప్రముఖులు స్వయంగా సంప్రదిస్తేనే దర్సనం కేటాయింపులు ఉంటాయన్నారు.
ముందస్తుగా 5 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామన్నారు. వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ఆలయంలో ట్రైజోనింగ్ స్ప్రే, భక్తులు గుమిగూడే ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం మేరకు శ్రీవారి సేవకులచే సేవలు వినియోగించుకుంటామన్నారు. జనవరి 11వ తేదీన రెండవ ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడారు.