గ్రహ గమనాన్ని బట్టి సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయి. అలా మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే, ఈ గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. 150 యేళ్ళకు ఒకసారి మాత్రమే ఇలాంటి గ్రహణం వస్తుంది. అదీకూడా ఆషాఢ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి రోజున తొలిసారిగా ఈ గ్రహణం వస్తుంది. అంతటి ప్రాధాన్యత ఈ గ్రహణానికి ఉంది.
అందుకే ఈ గ్రహణం రోజున ఎలా ఉండాలి, ఎపుడు భోజనం చేయాలన్నదానిపై జ్యోతిష్యులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా, చంద్రగ్రహణ సమయానికి సుమారు 4 గంటల ముందు అంటే రాత్రి 8 లేదా 9 గంటల లోపు భోజనం పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు.
శివపంచాక్షరీ మంత్రాన్ని పఠించటం, గ్రహణం మరుసటి రోజున శివాలయ దర్శనం, రుద్రాభిషేకం, బియ్యం, ఉలవలు, వెండి చంద్రబింబం, నాగ పడిగలు వంటివాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా గ్రహణం వల్ల కలిగే అరిష్టాలను తొలగించుకోవచ్చని కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
ఇక జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్న బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు గ్రహణం విడిచిన తర్వాత తప్పనిసరిగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వేదపండితులు అభిప్రాయపడుతున్నారు.