నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు రిజిస్ట్రేషన్ ప్రారంభం...

ఠాగూర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (10:47 IST)
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అర్జిత సేవా టిక్కెట్లను పొందగోరు భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఒక శుభవార్త చెప్పింది. శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‍‌సైట్ (ttdevasthanams.ap.gov.in) భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని తితిదే వెల్లడించింది. 
 
ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల లక్కీడిప్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు 23వ తేదీ 12 గంటల లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో టీటీడీ పేర్కొంది. ఇక శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు పేర్కొంది.
 
అదేసమయంలో 24వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని టీటీడీ తెలిపింది. అదే రోజు వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. తిరుమల, తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవా జనరల్ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైనులో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. 
 
అయితే అంతకంటే ముందు ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇక అదే రోజున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో వారి కోటా టికెట్లు విడుదల అవుతాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు