అపచారం.. అపచారం.. శ్రీవారి గర్భాలయంలోకి రమణ దీక్షితులు మనవడు..

బుధవారం, 2 నవంబరు 2016 (10:14 IST)
కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈ అపరాధానికి కారణమైన శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు సోమవారం టీటీడీ నుంచి నోటీసులు అందాయి. సెప్టెంబర్ ప్రథమార్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో.. శ్రీవారికి నైవేద్య విరామ సమయంలో నిబంధనలు అతిక్రమించి తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లారని టీటీడీ ఈవో సాంబశివరావుకు ఫిర్యాదు అందింది.
 
రమణ దీక్షితుల వివరణ కోరుతూ ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు నోటీసు అందజేశారు. సాధారణంగా ప్రధాన అర్చకులకు మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కేవలం గర్భాలయ వాకిలి వరకే ప్రవేశం ఉంటుంది.
 
ప్రధాన అర్చకుల వారసులకు శ్రీవారి పాదసేవ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, అందుకు టీటీడీ అనుమతి తీసుకోవాలి. ఇలా పాద సేవ చేసుకునే అవకాశం కూడా ఒక్కసారే ఉంటుంది. అది కూడా భవిష్యత్తులో ప్రధాన అర్చకత్వం స్వీకరించే వారికి మాత్రమే టీటీడీ ఈ అవకాశం కల్పిస్తుంది.
 
అయితే రమణదీక్షితులు తన మనవడిని పాద పూజ కోసం తీసుకెళ్లలేదు. టీటీడీ అనుమతి కూడా తీసుకోలేదని.. ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు అంది చాలా రోజులైనప్పటికీ సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతోపాటు అధికారులను విచారించాక నోటీసులిచ్చినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి