ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) హుండీలోకి ఇంకా పాత నోట్లు వస్తున్నాయి. తమ ఇష్టదైవమైన శ్రీవారికి భక్తులు పాత నోట్లను సమర్పించుకుంటున్నారు. ఈ నోట్లు కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో తితిదే పాలక మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాత నోట్ల మార్పిడి అంశాన్ని పార్లమెంటులో ఎంపీలతో లేవనెత్తి, తద్వారా పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు దారులు వెతకాలని భావిస్తోంది.
ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శుక్రవారం తితిదే పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎక్కువ శాతం వడ్డీ వచ్చేలా బంగారాన్ని కూడా ఐదేళ్లకు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమల కొండపై తాగునీటి సరఫరా కోసం రూ.10 కోట్లను కేటాయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు. మరోవైపు, దీనికి సంబంధించిన యంత్రాల కొనుగోలు కోసం తితిదే సభ్యురాలు సుధానారాయణమూర్తి కోటి రూపాయల విరాళం ఇచ్చారు.