వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే వడగళై u ఆకారం, తంగలై y ఆకారంలో స్వామివారికి నామాలు పెట్టాల్సి ఉంది. అయితే వైష్ణవ సాంప్రదాయాన్ని మంటగలిపారంటూ జియ్యంగార్లు రమణదీక్షితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రమణదీక్షితులకు నోటీసులు అందించేందుకు టిటిడి సిద్ధమైంది.
దీనిపై రమణ దీక్షితులు స్పందిస్తూ.. శ్రీవేంకటేశ్వరస్వామి వారి నామాలను తాను మార్చలేదన్నారు. 45 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నానని... ఇలాంటి పనులు తాను చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని... తమపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లానని చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో నైవేద్య విరమణ సమయంలో తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ ఈవో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, శ్రీవారి నామాలను మార్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.