బాహుబలికి 2018లో పాలాభిషేకం.... బెంగుళూరులో... ఎందుకు...?

శనివారం, 7 మే 2016 (16:29 IST)
ఈ బహుబలి గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటక వెళ్ళాల్సిందే. ఇది కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉంది. ఇది తెల్లటి గ్రానైట్ శిలతో రూపొందించిన అధ్భుతమైన ఏక శిలా విగ్రహం. 1000 సంవత్సరాలకు పైబడి ఉన్నా ఈ విగ్రహం ఇంతవరకు చెక్కుచెదరలేదు. ఇది జైనుల యొక్క పుణ్య క్షేత్రం. దాదాపు ఈ బహుబలి ఎత్తు 60 అడుగులు ఉంటుంది. తలభాగం 6.5 అడుగులు పరిమాణంలో ఉంటుంది. ఈ జైన దేవాలయం ఉన్న అతి పెద్దకొండ పేరు వింధ్యగిరి కొండ. విచిత్రమేమంటే ఇంత పెద్ద ఏకశిలా విగ్రహాన్ని అంత పెద్ద వింధ్యగిరి కొండ పైకి ఏ యంత్రాల సహాయం లేకుండా ఎలా తీసుకెళ్ళగలిగారనేది.
 
ఈ బ్రహ్మాండమైన ఏకశిలా విగ్రహం గోమటేశ్వరను బహుబలి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ బహుబలి ఒక జైన సన్యాసి. ఈ విగ్రహం పూర్తిగా నగ్నంగా ఉంటుంది. ఇంకా ఇదొక్కటే కాక ఈ ఏకశిలా విగ్రహం చుట్టూ అనేక చిన్నచిన్న విగ్రహాలున్నాయి. అవి కూడా ఇలాగే పూర్తిగా నగ్నంగా ఉన్నాయి. ఇంకా ఈ ఎత్తైన కొండపై చూస్తే, క్రింద గల అతిపెద్ద కోనేరు మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరియొక కొండ దీనికి ఎదురుగా ఉంటుంది. ఈ కొండ ఎక్కడానికి మొత్తం 700 లకు పైగా మెట్లు కలవు. ఇవి పూర్తిగా రాతితో కొండ పై చెక్కబడినవే. ఇంకా వృద్దులు ఈ కొండ పైకి ఎక్కడానికి పల్లకిలు ఉంటాయి. నలుగురు ఆ పల్లకిని మోస్తూ క్రిందకు పైకి తీసుకువెళతారు.
 
పర్యాటకులను ఈ ప్రదేశం ఇట్టే ఆకట్టుకుంటుంది. యువలకు క్రిందకు దిగేటప్పుడు సరదా ఉంటుంది. అది ఏమిటంటే మెట్లకు ఇరు పక్కలా ఇనుప కడ్డీలున్నాయి. దానిపై కూర్చుంటే తేలికగా క్రిందకు రావచ్చు. ఈ దేవాలయం పుట్టుపూర్వోత్తరాలు చూస్తే గంగా రాజైన రాచమల్ల సత్యవాక్ 4కు మంత్రి అయిన చాముండరాయ ద్వారా క్రీ.శ 983వ సంవత్సర ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెలగొల పట్టణానికి దగ్గరలో గల చంద్రగిరి కొండపై నిర్మించబడి ఉంది. ఈ విగ్రహం నిర్మాణ శైలి అత్యంత పవిత్రమైన జైన మత సాంకేతికంగా గుర్తిస్తారు. అయితే జైనులు వారి మతంలో మొదటగా మోక్షం సాధించింది బహుబలి మాత్రమే అని ప్రగాఢ విశ్వాసం. ఈ విగ్రహం ఆకారం ఒక తామర పువ్వు పై నిలిచి ఉన్నట్లుగా ఉంటుంది. ఈ విగ్రహం తొడల వరకు ఎటువంటి ఆధారం లేకుండా నిలిచి ఉంటుంది.
 
జైనుల ఆచార శైలిలో ఈ విగ్రహం పూర్తిగా నగ్నంగా ఉంటుంది. 30 కి.లో మీటర్ల దూరం నుంచి చూసినా సరే ఈ విగ్రహం కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా విగ్రహంగా పేరు పొందింది. అందుకుగాను ఈ విగ్రహం యొక్క ఆకారం, అందమైన ఆకృతి, చక్కనైన శరీర సౌష్టవం, మనోహరమైన చూపులు, వంకరలు తిరగిన జట్టు, కళా నైపుణ్యం మరియు హస్త కళా నైపుణ్యాల మేలు కలయిక ఈ విగ్రహం మధ్య యుగ కర్ణాటక శిల్ప కళకు విశిష్టమైన సాధనగా పేరు సంపాదించింది.
 
ఈ జైన మందిరంలో 12 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం నలుమూలల నుండి ఎందరో జైనులు ఇక్కడకు విచ్చేసి బాహుబలికి మహమస్టకాభిషేకం నిర్వహిస్తారు. ఇది వాళ్ళు అతి పెద్ద పండుగగా జురుపుకుంటారు. బ్రహ్మండమైన ఈ గోమటేశ్వర విగ్రహాన్ని వారు పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పువ్వు మరియు బంగారు నాణెములతో అత్యధ్భుతంగా అభిషేకిస్తారు. ఇలాంటి రకమైన అధ్భుత అభిషేకం చివరిసారిగా 2006లో జరిగింది. మళ్ళీ ఇలాంటి అభిషేకం 2018లో జరుగనుంది. అసలు బహుబలి కథ ఏంటంటే జైన వీరుడైన ఈ బహుబలి యుద్ధంలో చివరి వరకు పోరాడి గెలిచాడట. తర్వాత ఆయన ఎవరికీ కనబడకుండా కనుమరుగయ్యాడని ఇక్కడి వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి