ప్రేమకూ తప్పని ఆధునికత అవస్థలు

Munibabu

శనివారం, 4 అక్టోబరు 2008 (19:03 IST)
ప్రేమ అనే రెండక్షరాలు యుగాలుగా మనిషితో సహవాసం చేస్తూనే వస్తున్నాయి. తరాలు మారినా మనిషి స్వభావాలు మారినా ప్రేమ మాత్రం ఏనాటికి మారని ఓ తీయని నేస్తంగా మనిషి మనసులో చోటు సంపాదిస్తూనే ఉంది. అయితే మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రేమభావం మారకపోయినా దానికి సంబంధించిన అర్థం, పరమార్థం మాత్రం మారిపోతోందనే చెప్పవచ్చు.

అప్పుడే విరిసిన మల్లెలా, చంటిపాపాయి నవ్వులా, తూరుపున విరిసిన తొలి కాంతి కిరణంలా స్వచ్ఛమైన ప్రేమ సైతం ప్రపంచీకరణతో క్రమంగా సున్నితత్వాన్ని కోల్పోతోంది. జీవితం కంటే ప్రేమ గొప్పది అనే కాలం నుంచి ప్రేమ కంటే జీవితం గొప్పది అనే కాలానికి పయనించి అసలు జీవితంలో భాగం మాత్రమే ప్రేమ అనే దశవరకు ప్రేమలో పెను మార్పులు సంభవించాయి.
ఈ తరం ప్రేమలంటే అవే మరి...
  మనసుకు నచ్చినవారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే గానీ ప్రేమను మాత్రం వదులుకోమంటూ మొండిగా నిలిచే దశ నుంచి పరిస్థితులకు అనుకూలించకపోతే ప్రేమనైనా వదులుకోవడానికి నేడు మనిషి సిద్ధమైపోయాడు.      


ఆనాడు సలీం తన ప్రేయసి అనార్కలీ కోసం ఆధికారాన్ని, ఆనందాన్ని వదులుకుని ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యాడని చరిత్ర చెబితే ఎంత గొప్ప ప్రేమ చరిత్ర అంటూ కళ్ల నీళ్లు తుడుచుకున్నారు. లైలా, మజ్నూ, పార్వతీ, దేవదాసుల ప్రేమ త్యాగాన్ని కథల్లో చదివి ప్రేమబంధానికున్న గొప్పతనం అదేనంటూ మెచ్చుకున్నారు.

కానీ రోజులు మారాయి. పరిస్థితులూ మారాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ సంస్కృతులు మిళితమై ప్రపంచమే కుగ్రామమై పోతున్న వేళ ప్రేమ అనేది ఓ మధుర బంధం అనే స్థాయి నుంచి ఓ వ్యాపార ఒప్పందంగా మారిపోయింది. కేవలం మనసు స్పందనకు విలువిచ్చి ఎదుటివారి గురించి ఏమీ తెలియకనే తమ సర్వస్వాన్ని అర్పించే స్థాయి నుంచి అన్నీ తెలిస్తే కానీ, వారి వల్ల ప్రయోజనం ఉంటే కానీ... ప్రేమకు సైతం అంగీకారం తెలపలేని స్థితికి మనిషి చేరుకున్నాడు.


మనసుకు నచ్చినవారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే గానీ ప్రేమను మాత్రం వదులుకోమంటూ మొండిగా నిలిచే దశ నుంచి పరిస్థితులకు అనుకూలించకపోతే ప్రేమనైనా వదులుకోవడానికి నేడు మనిషి సిద్ధమైపోయాడు. కాలం మార్పుకు లోనైనపుడు మనిషి జీవితంలో మార్పులు తప్పనిసరి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ కాలం ఎంత ఆధునీకత సంతరించుకున్నా, మనిషి అంతరిక్షాన్నే జయించినా మనసు, మమత అనేవి ఎక్కడికీ పోవన్నది కూడా నమ్మి తీరాల్సిన నిజం.

మరి మనసు, మమత మారనపుడు దానికి సంబంధించిన ప్రేమ మాత్రం ఎలా మారిపోతుంది అని ప్రశ్నించుకుంటే సమాధానం సులభంగానే దొరుకుతుంది. ఒకప్పుడు మనిషి జీవితంలో విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తి తన మనసు చెప్పినట్టు నడ్చుకోవడానికే వీలైనంత ఎక్కువగా మొగ్గు చూపేవాడు.
లవ్ బిజినెస్...
  ప్రస్తుత కాలంలో ప్రేమ సైతం అంగట్లో దొరికే వస్తువుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో మనుషుల మధ్య జనించే ప్రేమ తన నిజమైన పరిమళాన్ని, సున్నితత్వాన్ని కోల్పోయి ఓ వ్యాపార లావాదేవీగా మారిపోయింది.      


కానీ ప్రస్తుతం మనిషి బంధాలకన్నా, బాంధవ్యాలకన్నా డబ్బు తద్వారా వచ్చే సుఖాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. దాంతో ఏ బంధాన్నైనా డబ్బు అనే కోణంలోంచే చూడడం మనిషి క్రమంగా అలవర్చుకున్నాడు. దాంతో డబ్బు అనే అంతిమ ప్రయోజనం లేని ఏ పనైనా, మరే బంధమైనా కొనసాగించడం మనిషి దృష్టికి పిచ్చితనంగా, చేతకానితనంగా కన్పించడం మొదలైంది.

ఈ రకమైన ఆలోచన మనిషిలో క్రమంగా బలపడుతూ చివరకు అదే అతని జీవిత పరమార్ధంగా మారింది. దాంతో జీవితంలోని యవ్వనప్రాయంలో చిగురించే ప్రేమను సైతం డబ్బు కోణంలోంచే మనిషి చూడడం ప్రారంభమైంది. అందుకే నేటి ఆధునిక కాలంలో ప్రేమ అనేది చిగురించాలన్నా, అది కొనసాగాలన్నా డబ్బుతో సంబంధపడిన వివిధ మార్గాల ద్వారానే జరుగుతోంది.

అందుకే ప్రస్తుత కాలంలో ప్రేమ సైతం అంగట్లో దొరికే వస్తువుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో మనుషుల మధ్య జనించే ప్రేమ తన నిజమైన పరిమళాన్ని, సున్నితత్వాన్ని కోల్పోయి ఓ వ్యాపార లావాదేవీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితి వల్లే డబ్బు, హోదా లేనివారిలో పుట్టే ప్రేమ ఎదుటివారికి ఓ పనికిమాలిన చర్యగా, ఎందుకూ పనికిరానిదిగా కన్పిస్తోంది.

అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. డబ్బు అంటూ జీవితంలో ఏ బంధాన్నీ లక్ష్య పెట్టని మనిషి సైతం ఒక్కోసారి ప్రేమ రాహిత్యంతో పిచ్చివాడవుతున్న పరిస్థితులు నేటిరోజుల్లో కోకొల్లలు. దాంతో డబ్బు కోణంలోంచి ప్రేమబంధాన్ని చూస్తూ దాన్ని దూరం చేసుకున్నాక కొంతకాలానికి ప్రేమ విలువ తెలుసుకుని చింతించేవారూ లేకపోలేదు.
ప్రేమ విలువ తెలియకుంటే అంతే...
  ఎంత డబ్బున్నా తనకోసం కాసింత ప్రేమ పంచేవారు దొరక్కపోతారా అంటూ ఎందరో తపిస్తున్నారు. అలాంటివారిని కదిలిస్తే మనసు, మమతలాంటివి మనిషికి ఎంత అవసరమో చక్కగా చెబుతారు.      


ఎంత డబ్బున్నా తనకోసం కాసింత ప్రేమ పంచేవారు దొరక్కపోతారా అంటూ ఎందరో తపిస్తున్నారు. అలాంటివారిని కదిలిస్తే మనసు, మమతలాంటివి మనిషికి ఎంత అవసరమో చక్కగా చెబుతారు. లోకంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టే ప్రేమ అనే భావానికి దానివల్ల ఏర్పడే బంధాన్ని చాలామంది గుర్తించకపోయినా నిజమైన ప్రేమ మాత్రం ఇంకా తన ఉనికిని చాటుతూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి