ప్రేమికులూ ప్రేమను కాపాడుకోండి

మనసులో ప్రేమ మైకం కల్గించినవారిని ప్రేమలో పడేయడం ఎంత కష్టమో వారు మన ప్రేమను ఒప్పుకున్న తర్వాత ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే పెళ్లైన కొత్తల్లో భార్యా, భర్తలు చాలా అన్యోన్యంగా ఉండి కొన్ని రోజులు పోయాక ఎలా దెబ్బలాడుకుంటుంటారో ప్రేమికులు సైతం ప్రేమలో పడ్డ కొన్నాళ్లకు దెబ్బలాడుకోవడం మామూలే.

అయితే ఈ దెబ్బలాట చిన్న చిన్న కోపాలకు, అలకలకు మాత్రమే పరిమితమైతే ఫర్వాలేదు గానీ విడిపోతే బాగున్ను అనిపిస్తే మాత్రం ప్రమాదమే. పెళ్లి బంధం ఎంత గొప్పదో ప్రేమ బంధం సైతం అంతే గొప్పది. పదిమంది సాక్షిగా ఒకటైన పెళ్లి బంధానికి భార్యాభర్తలు విలువ ఇచ్చినట్టే రెండు మనసుల సాక్షిగా చిగురించిన ప్రేమ బంధానికి ప్రేమికులు అంతే విలువ ఇవ్వాలి.

అయితే పెళ్లి బంధం చిక్కుల్లో పడ్డప్పుడు ఇరు తరపులవారు రంగంలో దిగి భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టడానికి తమ వంతు సాయం చేస్తారు. కానీ ప్రేమబంధంలో అది వీలుకాదు. అందుకే ప్రేమబంధానికి సమస్యలు ఎదురైతే ప్రేమికులే దాన్ని కాపాడుకోడానికి కృషి చేయాలి.

ప్రేమలో పడ్డ కొత్తల్లో అంతా బాగానే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ ఎదుటివారిలోని బలహీనతలు, ఎదుటివారికి నచ్చని కొన్ని (అవ)లక్షణాలు గోచరిస్తాయి. అంతమాత్రం చేత ప్రేమ విషయంలో మన ఎంపిక తప్పేమో అన్న నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనసులో ఎంతటి ప్రేమభావం ఉన్నా మనష్యులుగా ప్రేమికులిద్దరికీ కొన్ని పరిమితులుంటాయి.


ఈ విషయాన్ని ప్రేమికులిద్దరూ గుర్తించుకోగలగాలి. ప్రేమంటే సినిమాల్లో, కథల్లో చెప్పినట్టూ ప్రేమికులిద్దరూ చెట్టూ, పుట్టా పట్టుకు తిరుగుతూ కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గడిపేయడం అన్నిసార్లూ వీలుకాదు. ప్రేమలో పడ్డవారికి సైతం రోజువారీ చేయాల్సిన అన్ని పనులూ ఉంటాయి.

ఎలాగైతే ఇంట్లో మనకు అమ్మ, నాన్న, ఇతరబంధువులు ఇలా ఎన్ని బంధాలున్నా వారితో మన సానిహిత్యాన్ని ప్రదర్శిస్తూనే మిగిలిన పనులకు సైతం సమయాన్ని కేటాయిస్తున్నామో అలాగే ప్రేమను కూడా భావించగలగాలి. అలా చేయగలిగినవారు మాత్రమే ప్రేమను పదికాలాలపాటు కాపాడుకోగలరు.

ప్రేమికులుగా మారిన వెంటనే ఇక అదేలోకంగా, అది తప్ప మరో ప్రపంచం లేనట్టు ప్రవర్తిస్తే అలాంటి ప్రేమ ఎక్కువకాలం నిలబడే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ప్రేమికులిద్దరూ తమలోని అన్ని రకాల భావాలను పంచుకుంటూనే ఒకరినొకరు అర్ధం చేసుకోగలగాలి. అప్పుడే వారి ప్రేమబంధం జీవితబంధానికి దారితీస్తుంది.

చెప్పిన సమయానికి ప్రియుడు రాలేదని ప్రేయసి అలగడం, ప్రేమలో పడ్డ కొత్తల్లోలా ప్రేయసి తన అలంకరణ విషయంలో శ్రద్ధ చూపలేదని ప్రేమికుడు చిర్రుబుర్రులాడడం లాంటివి చేస్తే వారి ప్రేమకథ కంచికి వెళ్లే సమయం ఆసన్నమైనట్టే. ప్రేయసి లేదా ప్రేమికుడు తమకు ఇష్టం లేని పనులు చేస్తుంటేనో, లేదా ఇష్టమైన పనులు చేయడానికి సమయం లేదని అంటుంటేనో అందుకు గల కారణాలు తెలుసుకోవాలి.

ఆ కారణాల్లో నిజముంటే అందుకు ఎదుటివారు సైతం ఒప్పుకోగలగాలి. అలాకాక వారు చెబుతున్న కారణాల్లో నిజం లేనట్టైతే ఆ విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగలగాలి. అలా చేయగల్గితే ప్రేమబంధం సైతం ఎలాంటి అరమరికలు లేకుండా కలకాలం నిలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి