విపక్షాలకు సింహస్వప్నం... కనుమరుగైన "రాజ"సం

FILE
ఆయన ఒంటి చేత్తో కాంగ్రెస్‌కు విజయాన్ని సాధించిపెట్టడమే కాక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రెండోసారి నెలకొల్పారు. ఒకవైపు తెరాస తెలంగాణా.. తెలంగాణా అంటూ నానా రభస చేస్తున్నా తెలంగాణా ప్రజల్లో ఆ భావం లేదనీ, అన్నిటికీ కారణం వెనకబాటుతనమేననీ దాన్ని రూపుమాపి తెలుగు తల్లి బిడ్డలందర్నీ సమైక్యంగా ఉంచుతానని ప్రతిన బూనిన మహానేత. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండోసారి అధికారాన్ని కట్టబెట్టి ఇక తను చేయాల్సిన కార్యం అయిపోయిందని తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ మహానేత వైఎస్సార్. ఆయనను ఈ సంవత్సరాంతంలో మరొక్కసారి స్మరించుకుందాం...

వైఎస్సార్ పూర్తి పేరు డాక్టర్ ఎడుగురి సందింటి రాజశేఖర రెడ్డి. వైఎస్సార్‌గానే అందరికీ సుపరిచియులు. రాష్ట్రంలో జవసత్వాలు ఉడికిపోయి చచ్చుబడిన కాంగ్రెస్‌కు ప్రాణం పోసి నిలబెట్టిన రాజకీయ దిగ్గజం వైఎస్సార్. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని సాధించిపెట్టడంతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి రికార్డు నెలకొల్పారు.

సహజంగా అధికారంలో ఉన్నవారు ప్రజలకు దూరమవుతారు. కానీ రాజశేఖరరెడ్డి అహర్నిశలు ప్రజలకు చేరువగా ఉండాలని, వారి కష్ట సుఖాలను తీర్చాలనే లక్ష్యంతో అనేకానేక కార్యక్రమాలు చేపట్టారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా నాడు మండుటెండలను సైతం లెక్కచేయక పాదయాత్రలు చేసిన వైఎస్ మరోసారి ఆ పేదలకోసం సెప్టెంబరు 2న రచ్చబండవైపు పయనమయ్యారు. అయితే విధి వక్రీకరించింది. ఊహించనిరీతిలో ఆయనను కబళించింది. అయినా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో వెలుగురేఖలా నిరంతంరం కాంతులీనుతూనే ఉన్నారు.

రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే గ్రామాలు బాగుపడాలనే సిద్ధాంతాన్ని వైఎస్సార్ బలంగా నమ్మేవారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకే ముఖ్యమంత్రి అయిన తరువాత పలు పథకాలు చేపట్టారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, పేదలకు ఇందిరమ్మ గృహాలు, ఆరోగ్య శ్రీ వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది.

2004 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర వైఎస్ రాజకీయ జీవితానికి హైలెట్‌గా చెప్పుకోవచ్చు. 1400 కిలోమీటర్ల మేరసాగిన పాదయాత్రలో ఆయన వేలాది గ్రామాల గుండా సాగింది. గిరిజన, కొండజాతులవారిని నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ ఉపాధి, నిలువ నీడనిస్తానని హామీ ఇచ్చారు. పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి, ఉన్నత తరగతి అనే తేడా లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ఎన్నికల్లో వైఎస్‌ను అధికారంవైపు నడిపించారు.

ఆయన మాటలను సమాజంలోని అన్నివర్గాలు విశ్వసించాయి. చివరకు ఆయన 2004లో ఆంధ్రప్రదేశ్‌‍కు తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.. 2004లో మే 14న తనను ఆదరించిన ప్రజల మధ్యే ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ ఆనాడు తన తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలుపై పెట్టి ఇచ్చిన మాటకు విలువనిచ్చే నేతగా ప్రజల మన్ననలు అందుకున్నారు. అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రాభివృద్ధికై ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైంది జలయజ్ఞం.

రాష్ట్ర బడ్జెట్లో సింహభాగాన్ని జలయజ్ఞానికే కేటాయించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ధ్యేయంతో ఆయన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకంలో కోట్లలో అవినీతి జరిగిందని విపక్షాలు విమర్శించాయి. ఈ దశలో 2009 ఎన్నికలు జరిగాయి. సినీనటుడు చిరంజీవి కొత్తపార్టీతో బరిలోకి దిగారు. ముక్కోణపు పోటీ ఉంటుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి పార్టీకి వైఎస్ అధికారాన్ని కట్టబెట్టారు.

2009 ఎన్నికల్లో ఇతర పార్టీల ఉచిత టీవీలు, నగదు బదిలీలు వంటి ప్రజాకర్షక పథకాలెన్నో ప్రకటించాయి. దీనికి తోడు చిరంజీవి సినీ గ్లామర్. అయితే వీటిలో దేనికి వైఎస్సార్ బెదరలేదు. తాను అమలు చేసిన పథకాలనే మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు వైఎస్ మాటలనే నమ్మారు. ప్రజానాడిని పట్టడంలో రాష్ట్రంలో ఆయన మించిన నేత లేరని విషయం 2009 ఎన్నికలు నిరూపించాయి. కాంగ్రెస్‌కు 156 అసెంబ్లీ సీట్లు, 33 లోక్‌సభ స్థానాలను సాధించిపెట్టారు.

సూటి మాటల రాజశేఖరుడు
ఎప్పుడూ ధవళ వర్ణంలో కనిపించే దుస్తులు, తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టుతో వైఎస్ దర్శనమిస్తారు. నాటి గాంధీగారి సిద్ధాంతాలను పాటిస్తున్నట్లుగా ఆయన కనబడతారు. బహుశా, ఈ వస్త్రధారణే ఆయనను తెలుగు ప్రజల హృదయాలకు మరింత దగ్గర చేసిందేమో. రాజకీయ నాయకుల్లో చాలామంది అప్పటికప్పుడే మాట మారుస్తుంటారు. చెప్పిన మాటను చెప్పలేదంటారు. కానీ వైఎస్ దీనికి మినహాయింపంటారు ఆయనతో సన్నిహితంగా మెలిగిన స్నేహితులు.

మనసులో ఒక మాట, పైకి మరో మాట చెప్పే మనస్తత్వం వైఎస్ కాదంటారు. ఏది ఉన్నా ముఖం మీదే చెప్పేస్తారంటారు. 2009 ఎన్నికలలో పార్టీని విజయతీరాలకు నడిపించే బాధ్యతనంతా ఆయన ఒక్కరే తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో స్వపక్షం నుంచి కొందరు నాయకులు వైఎస్ వ్యవహార శైలిని వెనుక నుంచి ఎండగట్టే ప్రయత్నం చేశారు. అయితే వారి వ్యాఖ్యలను పట్టించుకోని వైఎస్ తనదైన శైలిలో ప్రజాయాత్రలను చేపట్టి మరోసారి తన జైత్రయాత్రను కొనసాగించారు.

సమాజానికి ఏం చేస్తున్నామని ఆలోచించండి: వైఎస్సార్
భూమిపై మానవ రూపంలో పుట్టిన ప్రతిఒక్కరూ ఒకరికొకరు సాయం చేసుకోవాలని, కష్టాలలో ఉన్న తోటివారిని ఆదుకోవాలనే దృక్పథం కలిగి ఉండాలన్నది వైఎస్సార్ ఫిలాసఫి. ఒకరికి సాయం చేసి తిరిగి వారి సాయంకోసం ఎదురు చూడరాదంటారాయన. అంతేకాదు... మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ... నేను ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో... అని చూడకుండా సమాజానికి నేను ఎంత చేశాను అని ఆలోచించాలంటారు. సమాజానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించాలి తప్ప, దుర్వినియోగ పరచరాదని చెపుతారు. తనతోటి నేతలకు సందర్భం వచ్చినపుడల్లా ఆయన ఇదే చెపుతుంటారు.

ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు తనకు కల్పించాడు కనుక దానిని తాను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాను. వృద్ధులకు, మహిళలకు, బాలలకు ఒక ముఖ్యమంత్రిగా నేను చేయాల్సినదంతా చేస్తున్నానని వైఎస్ గతంలో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు తపించిన ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలై రాష్ట్ర ప్రజానీకాన్ని శోక సముద్రంలో వదిలివెళ్లారు. ఇటువంటి ప్రజానాయకుడు అర్థంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగువారి దురదృష్టం. ఆంధ్రనాట అది ఒక దుర్దినం.

వెబ్దునియా పై చదవండి