సంక్రాంతి పురుషుడు మీ ఇంటికొస్తున్నాడు...

గురువారం, 11 జనవరి 2018 (16:11 IST)
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు తులారాశివరకు ఒక కాలం... దీనినే దేవతలకు పగలు అంటారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పటి నుంచి మేషం వరకూ రాత్రి అంటారు. అలాగే అటు మేషానికి సూర్యుడు వచ్చినప్పుడు, మరలా తులలోకి చేరినపుడు రాత్రింబవళ్లు సమకాలం అవుతుంటుంది. అసలు సంక్రాంతి అంటే... సంక్రమణం అని అర్థం. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి రావటమే. 
 
ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ రెండు సంక్రమణాలకే ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించింది మొదలు మకర రాశిలో ప్రవేశించేంత వరకూ దక్షిణాయనమని అంటారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు సంక్రమణ పుణ్యకాలమనబడుతుంది. ఇలా సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్లినప్పుడు, ఆ కాలాన్ని కలికాలం అని కూడా పిలుస్తారు. 
 
ఎందుకంటే దక్షిణాయనంలో మానవులచే చేయబడిన పాపాలను తొలగించటానికి ఉత్తరాయన కాలంలో సంక్రాంతి పురుషుడు వేంచేస్తాడు. ఆ సంక్రాంతి పురుషుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారి పాపాలను సంక్రాంతి పురుషుడు సమూలంగా పోగొడతాడు. కనుక ఈ సంక్రాంతితో మీ ఇల్లు శోభాయమానమై, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ... 
 
మీ
యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
వెబ్‌దునియా తెలుగు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు