విశ్వక్రీడలైన ఒలింపిక్స్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చైనా ప్రస్తుతం పారాలింపిక్స్‌ను సైతం అదే రీతిలో నిర్వహించడానికి సిద్ధమైంది. బీజింగ్ వేదికగా శనివారం నుంచి ఈ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
మొత్తం 150 దేశాల నుంచి విచ్చేయనున్న నాలుగువేలకు పైగా వికలాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పారాలింపిక్ సందర్భంగా 21 క్రీడాంశాల్లో పతకాల కోసం క్రీడాకారులు పోటీపడనున్నారు.
ఆర్చరీ, అధ్లెటిక్, బోసియా, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, గోల్‌బాల్, జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ సిట్టింగ్, వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్, వీల్‌చెయిర్ ఫెన్సింగ్, వీల్‌చెయిర్ రగ్బీ, వీల్ ఛెయిర్ టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో ఈ పారాలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.
కొద్దిరోజుల క్రితం విశ్వక్రీడలను అత్యంత వైభవంగా నిర్వహించిన చైనా ఈ పారాలింపిక్స్ ప్రారంభోత్సవాలను సైతం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లతో బీజింగ్ నగరం ఇప్పటికే ముస్తాబైంది. బీజింగ్ నగరంలో శనివారం ప్రారంభోత్సవాలను నిర్వహించి ఆదివారం నుంచి పారాలింపిక్స్ పోటీలను ప్రారంభించనున్నారు.