ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంలో భారీ నష్టం వాటిల్లింది. హర్యానా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. దీంతో చక్కెర మిల్లులోకి వరద నీరు వచ్చి చేరడంతో ఏకంగా రూ.60 కోట్ల విలువ చేసే చక్కెర నీటిపాలైంది. హర్యానాలో కుండపోత వర్షాలాకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన సరస్వతి మిల్లులో భారీ నష్టం వాటిల్లింది.
యమునా నగర్‌లోని ఈ మిల్లులో రాత్రికి రాత్రే ఈ ఘటన చోటుచేసుకుంది. మిల్లు పక్కనే ఉన్న కాల్వ పొంగిపొర్లడంతో వరద నీరు ఒక్కసారిగా మిల్లులోకి వచ్చి చేరింది. దీంతో మిల్లులో నిల్వవుంచిన రూ.60 కోట్ల చక్కెర నీటిలో కరిగిపోయిందని మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. గిడ్డింగిలో నిల్వవుంచిన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారలో అత్యధిక బాగం తడిసిపోయిందని ఆయన వెల్లడించారు.