అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

ఐవీఆర్

మంగళవారం, 1 జులై 2025 (16:00 IST)
పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత జమ్ము-కాశ్మీరులో భద్రత కట్టుదిట్టం చేసారు. ఇక జూలై 3 నుంచి అమప్ నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అమర్‌నాథ్ యాత్రలో నకిలీ యాత్ర కార్డుతో ఓ వ్యక్తి పట్టుబడటంతో కలకలం సృష్టిస్తోంది. అతడు ఏ ఉద్దేశంతో నకిలీ కార్డును ఉపయోగించి యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్నాడన్న దానిపై సమాచారాన్ని సేకరించడంలో భద్రతా సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
 
అమర్‌నాథ్ యాత్ర యొక్క పవిత్రత, భద్రతను కాపాడటానికి భద్రతా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఐతే ఓ వ్యక్తి యాత్రలో మోసపూరితంగా ప్రవేశించడానికి నకిలీ యాత్ర రిజిస్ట్రేషన్ కార్డును ఉపయోగించాడు. ఆ వ్యక్తిని జమ్మూ- కాశ్మీర్ పోలీసులు బాల్తాల్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుడిని హర్యానాలోని యమునా నగర్ జిల్లా జగధారిలోని ద్వారకాపూరి నివాసి కృష్ణ మిట్టల్ కుమారుడు శివం మిట్టల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
 
ఆ వ్యక్తి మోసం ద్వారా నకిలీ యాత్ర కార్డును పొందాడు. భద్రతా సిబ్బందిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. దీనితో సోనామార్గ్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్ట విభాగాల కింద ఎఫ్‌ఐఆర్ నంబర్ 13/2025 నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. యాత్రలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడినట్లు తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా నకిలీ లేదా చెల్లని యాత్ర రిజిస్ట్రేషన్ పత్రాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు