రష్యా యువ కెరటం మరియా కిర్లెంకో

Pavan Kumar

మంగళవారం, 27 మే 2008 (20:20 IST)
రష్యా యువ టెన్నిస్ క్రీడాకారుల్లో మరియా కిర్లెంకో ఒకరు. రష్యా రమణి మరియా షరపోవాకు అత్యంత సన్నిహితురాలు కిర్లెంకో. మరియా కిర్లెంకో ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో కొనసాగుతుంది. రష్యా సుందరి మరియా యుర్వేనా కిర్లెంకో 1987 జనవరి 25వ తేదీన మాస్కోలో జన్మించింది. చిన్నప్పటి నుండే టెన్నిస్ క్రీడాకారిణి కావాలనే ఆశ కిర్లెంకోలో ఉండేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు టెన్నిస్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

మరియా కిర్లెంకో 15ఏళ్ల ప్రాయంలో 2002లో జరిగిన కెనడియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ జూనియర్ టోర్నీలలో ఆడి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలను అతితక్కువ వయస్సులో గెలుచుకున్నవారిలో కిర్లెంకో అందరికంటే అగ్రస్థానంలో ఉంది. ఇదే ఏడాది నుంచి డబ్ల్యూటీఏ టోర్నీలలో పాల్గొనటం కిర్లెంకో మొదలుపెట్టింది.

2004లో గాయాలబారిన పడి కిర్లెంకో టెన్నిస్‌కు దూరమైంది. 2005 చివర్లో పునఃప్రవేశించి చైనా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. కిర్లెంకోకు కెరీర్‌లో తొలి టైటిల్ ఇదే. 2006 జూన్ 12వ తేదీ నాటికి టాప్20 జాబితాలోకి కిర్లెంకో ప్రవేశించింది. రష్యా తరఫున ఫెడ్ కప్‌లో కిర్లెంకో రంగప్రవేశం చేసి సింగిల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అయితే టోర్నీని రష్యా కోల్పోయింది. 2006 యూఎస్ ఓపెన్ మూడో రౌండులోకి కిర్లెంక్ ప్రవేశించినప్పటికీ అర్వానే రెజాయ్ చేతిలో పరాజయం పాలైంది. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కూడా కిర్లెంకో మూడో రౌండులోనే నిష్క్రమించింది.

2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కొంతమేర మెరుగ్గా రాణించిన కిర్లెంకో నాలుగో రౌండులోకి ప్రవేశించింది. కిర్లెంకో డబుల్స్‌లో ఆటతీరు మెరుగ్గా ఉన్నప్పటికీ సింగిల్స్ విభాగంలో నిలకడ లేదు. దీనిని అధిగమిస్తే టెన్నిస్‌లో రష్యాకు కిర్లెంకో మరింత ప్రతిష్టను పెంచగలదు.

సింగిల్స్ విభాగంలో 2005 చైనా ఓపెన్. 2007 సన్‌ఫీస్ట్ ఓపెన్, 2008 ఎస్ట్రోరిల్ ఓపెన్‌లలో కిర్లెంకో జయభేరి మోగించింది. డబుల్స్ విభాగంలో 2004 బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన డీఎఫ్ఎస్ క్లాసిక్‌లో షరపోవా-కిర్లెంకోలు జతకట్టి టైటిల్ కైవసం చేసుకున్నారు. 2005 టోక్యో ఓపెన్, 2007 దోహా ఓపెన్, 2008 ఎస్ట్రోరిల్ ఓపెన్‌లలో కిర్లెంకో జోడీ జయభేరి మోగించింది.

వెబ్దునియా పై చదవండి