రష్యా యువ క్రీడాకారిణి దినారా సఫీనా

Pavan Kumar

శుక్రవారం, 6 జూన్ 2008 (18:58 IST)
రష్యా యువ క్రీడాకారిణి దినారా సఫీనా కెరీర్‌లో మొదటిసారి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచ మాజీ నెంబర్‌వన్ క్రీడాకారుడు మారట్ సఫిన్ సోదరి సఫీనా. టెన్నిస్ క్రీడలో రష్యా ప్రతిష్టను ఇనుమడించే పనిలో ఉంది సఫీనా. దినారా మిఖాయిల్‌ఓవ్నా సఫీనా 1986, ఏప్రిల్ 27వ తేదీన మాస్కోలో జన్మించింది. సఫీనా చిన్నప్పటి నుంచే టెన్నిస్‌పై ఆసక్తి కనబరచటంతో తల్లి రౌజా ఇసాల్‌నోవా శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత క్రాజక్ ఆమెకు ప్రధాన శిక్షకుడుగా కొనసాగుతున్నాడు.

సఫీనా 2002లో ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది. ఇదే ఏడాది కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సోపట్‌లో సఫీనా కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో నగోయాను ఓడించి టైటిల్ అందుకుంది. ప్రపంచ 14వ నెంబర్ క్రీడాకారిణి సిల్వియా ఫార్నియా ఎలియాను సఫీనా ఓడించింది. అప్పటికి సఫీనా వయస్సు 16 సంవత్సరాలు. ఏడాది చివరి నాటికి టాప్100లో స్థానం సంపాదించింది.

2003లో జరిగిన టోర్నీల్లో మెరుగ్గా రాణించి టాప్50లోకి ప్రవేశించింది సఫీనా. పాలెర్మోలో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో కట్రానియా సెర్బోట్నిక్‌ను ఓడించి కెరీర్‌లో రెండో టైటిల్ సఫీనా అందుకుంది. అదే ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండులోకి ప్రవేశించి సఫీనా పరాజయం పాలైంది.

2004లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మూడో రౌండు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన అమండా కొయిట్జర్‌ చేతిలో సఫీనా ఓడిపోయింది. 2005 ఫెడ్ కప్ డబుల్స్ ఫైనల్లో ఎలీనా దెమంతివాతో సఫీనా జోడీ కట్టి టైటిల్ ఎగురేసుకుపోయింది. అదే ఏడాది జరిగిన క్రెమ్లిన్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ తార మరియా షరపోవాను 1-6, 6-4, 7-5 సెట్ల తేడాతో సఫీనా ఓడించింది.

2006 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి మరియా షరపోవాను 7-5, 2-6, 7-5 సెట్ల తేడాతో ఓడించి సఫీనా ముందంజ వేసింది. ఇదే ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమేలీ మౌరెస్మో చేతిలో సఫీనా ఓడిపోయింది. సఫీనా 2006లో రెండు ఫైనల్స్, రెండు సెమీస్, 9 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది.

2007 యూఎస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో నాథాలీ డెంచీతో సఫీనా జోడీ కట్టి టైటిల్ ఎగురేసుకుపోయింది. ఇదే ఏడాది వివిధ దేశాల క్రీడాకారులతో ఆడి సఫీనా అనుభవం సంపాదించింది. ఈ ఏడాది జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌ నాలుగు రౌండు మ్యాచ్‌లో మరోసారి సహదేశ క్రీడాకారిణి మరియా షరపోవాను 6-7, 7-6, 6-2 సెట్ల తేడాతో సఫీనా మట్టికరిపించింది. టోర్నీ ఫైనల్ పోరు అనా ఇవనోవిచ్-సఫీనాల మధ్య జరుగుతుంది.

సఫీనా ఇప్పటివరకూ 6 సింగిల్స్, 8 డబుల్స్ టైటిళ్లు అందుకుంది. దినారా సఫీనా ప్రస్తుతం ప్రపంచ 9వ ర్యాంకు క్రీడాకారిణిగా కొనసాగుతుంది. టాప్10 క్రీడాకారుల జాబితాలో మరియా షరపోవా (2), స్వెత్లానా కుజ్‌నెత్సోవా (4), ఎలీనా దెమంతివా (5), అన్నా చాక్వితద్జె (8) లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి