ఒలింపిక్స్ ఫైనల్లో పి.వి. సింధు రజత పతకం సాధించి దేశం గర్వపడేలా చేసింది. అయితే సింధు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం మాత్రం ఆమె కోచ్ గోపీచంద్ అనే చెప్పాలి. ఆమె వెనుక వెన్నుముకలా నిలబడ్డాడు. ఒకప్పుడు గోపీచంద్ బ్యాడ్మింటన్‌లో ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అప్పట్లో దేశమంతా గోపీచంద్ మారుమోగి పోయింది. ఆ తర్వాత కోలుకోలేని గాయాల.. ముగిసిందనుకున్న గోపిచంద్ కెరీర్... ఆ తర్వాత మెల్లగా కోలుకొని తిరుగులేని విజయాలు సాధించాడు.
సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒలింపిక్ పతకాలు సాధించి భారత కీర్తిప్రతిష్ఠలను పెంచడానికి ముఖ్య కారణమైన గోపీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలను వెల్లడించాడు. ఇంతమందిని ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన గోపీ... చదువులో చాలా వెనుకబడ్డ స్టూడెంట్ అట. అయితే అదే తన అదృష్టంగా మారిందని అంటున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ఆయన తెలిపిన ఇంకొన్నిఆసక్తికర విషయాలు మీ కోసం.
''ఇంజనీరింగ్ చదవాలని పరీక్షలు రాశాను కానీ విఫలమవడంతో... ఆటలను కొనసాగించాను. అదే నా జీవితాన్నిఇలా మార్చిందంటున్నారు'' గోపీ. ఈ స్థితికి రావటానికి ఒక్కో మెట్టుఎక్కుతూ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అనంతరం సొంత అకాడమీని స్థాపించి నాలాంటి వారిని ఈ దేశానికి అందించాలని దృఢసంకల్పంతో మొదలు పెట్టిన ఆయన కృషి ఫలితమే నేడు సైనా నెహ్వాల్, పి.వి.సింధూల విజయం వెనుక రహస్యం అని చెప్పవచ్చు.
అయితే అకాడమీ నెలకొల్పడం కోసం ఇంటిని తాకట్టు పెట్టారని చెప్పాడు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీని ప్రారంభించాడు గోపీ. ఎనిమిదేళ్ల వయసులో సింధు తన అకాడమీలో చేరగా.. కశ్యప్ 15 ఏళ్ల వయసులో చేరినట్లు చెప్పాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన కల 2012లో నెరవేరిందన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం నెగ్గగా.. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.