తన వయసు 22 యేళ్లుగా ఉన్నపుడు ఓ మైనర్‌తో డేటింగ్ చేశా. ఇది ఇద్దరి ఇష్టపూర్వకంగానే జరిగింది. కానీ, దాన్ని అత్యాచారంగా పరిగణించారు. ఏం చేయాలో తెలియలేదు. అందుకే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా అంటూ పెద్దగా పరిచయం అక్కర్లేని టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్య జిత్ ఘోష్ చెప్పుకొచ్చాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని గత మార్చిలో బెంగాల్‌కు చెందిన 18 ఏళ్ల తులికా దత్తా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో ఘోష్ కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఆపై ఇండియాకు వస్తే తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో యూరప్ లో కొన్ని రోజులు ఉండి, మేలో ఇండియాకు వచ్చాడు. అతనికి తోటి ఆటగాళ్లు, టీటీ సమాఖ్య అండగా నిలిచింది. తాజాగా, అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు చెప్పాడు.
'నాలుగు నెలల క్రితం వచ్చిన ఆరోపణలపై ఎలా స్పందించాలో తెలియలేదు. అందరూ ఆమెకే మద్దతుగా నిలిచారు. ఆమె మైనర్ అన్నారు. నేను కూడా చిన్న పిల్లాడినే. మేమిద్దరమూ డేటింగ్ చేశాం. డేటింగ్ ప్రారంభించినప్పుడు నా వయసు కేవలం 22 సంవత్సరాలు. నాకిప్పుడు భవిష్యత్తు ముఖ్యం. తొందర్లోనే కేసు కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా. తిరిగి ఒలింపిక్స్‌లో ఆడటమే నా లక్ష్యం' అని సౌమ్య జిత్ ఘోష్ వ్యాఖ్యానించాడు.