రియో ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. అయితే, ఈ క్రీడల ముగింపు చివరి రోజున ఓ చేదు ఘటన జరిగింది. తమ ప్లేయర్‌కు వ్యతిరేకంగా జడ్జీలు తీర్పు చెప్పారని ఇద్దరు కోచ్‌లు రెజ్లింగ్ కింగ్‌లోనే బట్టలు విప్పేసారు. కాళ్లకున్న షూలను తీసి విసిరికొట్టారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారితోపాటు టీవీల్లో చూసిన కోట్లాది మంది విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రీడల్లో భాగంగా, పురుషుల రెజ్లింగ్ 65 కేజీల విభాగం బ్రాంజ్ మెడల్ కోసం మ్యాచ్ మరో పది నిమిషాల్లో ముగియాల్సి వుంది. అప్పటికే ఆధిక్యంలో ఉన్న మంగోలియా ప్లేయర్ మందక్‌నరన్ గంజోరిగ్ ప్రత్యర్థికి దొరకకుండా రింగ్‌లోనే సంబురాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతని ఇద్దరు కోచ్‌లు కూడా రింగ్‌లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు.
దీనిపై ప్రత్యర్థి ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ నవురుజోవ్ ఫిర్యాదు చేశాడు. దీంతో రిఫరీలు మందక్‌నరన్‌కు పెనాల్టీ విధించడంతో ఉజ్బెక్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. రిఫరీల నిర్ణయంపై మంగోలియా కోచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరూ రింగ్‌లోనే బట్టలు విప్పేసి నిరసన తెలిపారు. కాళ్లకు ఉన్న షూలను విసిరికొట్టారు. రెజ్లర్ మందక్‌నరన్ కూడా విజేతను ప్రకటించే సమయంలో రిఫరీ పక్కన ఉండకుండా వెళ్లిపోయాడు. అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ తతంగాన్ని చూసిన వారంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సిందిపోయి ఇలా చేయడమేంటని ముక్కున వేలేసుకున్నారు.