తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ సలహా ఇచ్చారు. ప్రపంచ అందాల పోటీలపైనే కాకుండా రాష్ట్రంలో సంభవించే అగ్నిప్రమాదాలపై కూడా కాస్త దృష్టిసారించాలని ఆయన కోరారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ ప్రమాద స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అందాల పోటీలపైనేకాకుండా, అగ్నిప్రమాదాలపై కూడా దృష్టిసారించాలని కోరారు. అగ్నిప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. అలాగే, గుల్జర్ హాస్ అగ్నిప్రమాద మృతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇదే భారీ అగ్నిప్రమాదమన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్టు వెల్లడించారు.