భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్లో సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ జంట 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జోడి షాయి జంగ్-షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది.
ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్డ్ డబుల్స్పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో సానియా-రోహన్ బోపన్నలు జోడి కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్లో పరాజయం ఎదుర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన సానియా-రోహన్ బోపన్నలు మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్నారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే.. లియాండర్ పేస్.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగారు. 1996 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పేస్ మరో పతక కల ఈసారీ కలగానే మిగిలిపోయింది. ఒలింపిక్ బెర్తు దగ్గర నుంచి క్రీడా గ్రామంలో గది పంచుకునే విషయం వరకూ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పేస్-రోహన్ బోపన్న ద్వయం తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ మొదటి రౌండ్‌లోనే ఓడి అత్యంత అవమానకర రీతిలో రియో నుంచి నిష్క్రమించింది.