భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ కేవలం డబ్బుకోసమేనా? అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించడం తప్ప ఇంకేమీ చేయలేదా అంటే కాదనే అంటోంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవెలెప్మెంట్ అండ్ పీస్ సందర్భంగా పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన వర్చువల్ ప్యానల్ చర్చలో సానియా మీర్జా పాల్గొని క్రీడలకు సంబంధించిన విషయాలు వివరించింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా ఎంతో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులకు ఇది ఒక మంచి వేదికను కల్పిస్తుందని సానియా చెప్పింది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచంలోని మేటీ క్రికెటర్లతో కలసి ఆడేందుకు, వారితో పోటీ పడేందుకు బీసీసీఐ మంచి వేదికను కల్పించిందని సానియా ప్రశంసించింది.
ఇక ఐపీఎల్‌ను స్పూర్తిగా తీసుకొనే బ్యాడ్మింటన్ లీగ్, కబడ్డీ లీగ్, టెన్నిస్ లీగ్, హాకీ లీగ్, ఫుట్‌బాల్ లీగ్ వంటివి ఏర్పడ్డాయి. దీని ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి చాటగలుగుతున్నారని సానియా చెప్పింది. 'పరాజయం నుంచి ఎలా తేరుకోవాలి.. ఎలా పైకి రావాలో ఆటలు నేర్పిస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యం క్రీడల వల్లే సాధ్యమవుతుంది' అని సానియా మీర్జా వివరించింది.