భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు నిర్మాతగా మారిపోయారు. ప్రతియేటా సెప్టెంబరు ఐదో తేదీన నిర్వహిచే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని తన బ్యాడ్మింటన్ గురువు పుల్లెల గోపీచంద్‌పై లఘుచిత్రం నిర్మించింది. ఈ చిత్రంలో సింధు స్వయంగా నటించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చిన గోపీచంద్‌కు ఈ విధంగా గురుదక్షిణ చెల్లించింది.
"#IHATEMYTEACHER" పేరుతో ఉన్న లఘు చిత్రంలో గోపీచంద్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో క్లుప్తంగా వివరించింది. 'కోచ్ నిర్విరామంగా కష్టపడుతుంటారు. నా కోసం కలలు కంటారు. నాలో ఆత్మవిశ్వాసం నింపుతారు. నన్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఆయనకు నేనిస్తున్న చిన్న కానుకే ఇది. ఈ గురుపూజోత్సవం నాడు నా విజయాన్నంతా ఆయనకు అంకితమిస్తున్నా.
మీ జీవితాల్లో మార్పు తెచ్చి విజయాల బాట పట్టించిన ప్రతి ఒక్కర్నీ గౌరవించాల్సిందిగా కోరుతున్నా. మనపై మనం ఉంచే విశ్వాసం కన్నా వారు మనపై ఉంచే నమ్మకమే ఎక్కువ' అని సింధు తెలిపింది. గోపీచంద్ శిక్షణలో పీవీ సింధు రియో ఒలింపిక్స్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.