రవి దహియా@SILVER MEDAL: పోరాడి ఓడినా రికార్డే

గురువారం, 5 ఆగస్టు 2021 (18:41 IST)
Ravi Dahiya
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో రజత పతకం దక్కింది. రెజ్లింగ్‌లో భారత్‌కి స్వర్ణ పతకం అందించేలా కనిపించిన రవి కుమార్ దహియా.. ఫైనల్లో నిరాశపరిచాడు. రష్యా రెజ్లర్‌ చేతిలో ఓడిపోయిన రవి రజత పతకంతో సరిపెట్టాడు.
 
ఫురుషుల 57 కేజీల విభాగంలో ఈరోజు రష్యాకి చెందిన యుగేవ్ జావుర్‌తో ఫైనల్లో తలపడిన రెజ్లర్ రవి కుమార్ దహియా 4-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. దాంతో.. స్వర్ణం పతక ఆశలు రేపిన రవి కుమార్.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ రెజ్లింగ్‌లో కేడీ జాదవ్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్ మాత్రమే ఒలింపిక్ మెడల్స్ గెలిచారు. తాజాగా వారి సరసన రవి కుమార్ కూడా చేరాడు.
 
ఫైనల్లో ఆరంభం నుంచి యుగేవ్ జావుర్‌ దూకుడు ప్రదర్శించినా.. ప్రత్యర్థి బలంగా తిప్పికొట్టాడు. మొత్తంగా మూడు నిమిషాల మొదటి రౌండ్ ముగిసే సమయానికి 2-4తో రవి వెనుకబడ్డాడు. ఆ తర్వాత రౌండ్‌లోనూ రవికి నిరాశే ఎదురైంది. యుగేవ్ జావుర్‌ అటాకింగ్‌తో వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లగా.. రవి‌కి పుంజుకునే అవకాశమే దక్కలేదు. యుగేవ్‌తో జరిగిన  హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్‌ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్‌ కుమార్‌ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
 
కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. ఈరోజు ఉదయం ఫురుషుల హాకీ టీమ్ కాంస్య పతకం గెలుపొందగా.. తాజాగా రవి కుమార్ దహియా రజతం గెలుపొందడంతో భారత్ పతకాల సంఖ్య ఐదుకి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు