ధర్మ సూత్రధారీ హే మురారీ... ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (14:54 IST)
‘కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’... కృష్ణుడే పరమతత్త్వం... చరమ లక్ష్యం... ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం... అన్నీ అపురూపమైన అనుభవాలే.

‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా... ‘అటువైపు కృష్ణుడున్నాడు... ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా...  అవన్నీ పరమాత్మ విరాట్‌రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే...  క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది... యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.
 
భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి.

ఇందులో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒకమార్గాన్నే ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు.

భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. కృష్ణ కథలో ఈ రెండూ విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సయమంలో సర్వసమగ్రమైనవి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు