ఆస్ట్రేలియా ఆటతీరుపై నిల్సన్ సంతృప్తి

ఆస్ట్రేలియా జట్టు ఆటతీరుపై ఆ జట్టు కోచ్ టిమ్ నిల్సన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు ఇంగ్లాండ్‌లో శుక్రవారం ప్రారంభం కాబోతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు బాగా సిద్ధమవుతుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో ఒవెల్‌‍లో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టిమ్ నిల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. జట్టు ఆశావహ దృక్పథంతో ముందుకెళుతుందని చెప్పారు. ఈ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు బాగా రాణించారు. మిచెల్ జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మరో పేసర్ బ్రెట్‌లీ ప్రారంభంలోనే ప్రమాదకర న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను పెవీలియన్ దారి పట్టించాడు.

ఒక దశలో 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ తిరిగి పుంజుకుంది. 147 పరుగులు చేసి ఆలౌటయింది. ఆస్ట్రేలియా 148 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ (56), వైస్‌కెప్టెన్ మైకెల్ క్లార్క్ (49 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.

వెబ్దునియా పై చదవండి