రెండో వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీం ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 159 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది.

ఓపెనర్ రోహిత్ శర్మ (80, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో భారత ఇన్నింగ్స్ ఏ దశలోనూ పాక్‌కు విజయావకాశాలు కనిపించలేదు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ (52, 5 ఫోర్లు) కూడా రాణించడంతో రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత్ సునాయస విజయం దక్కించుకుంది.

ఇదిలా ఉంటే అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మెద్ షాజాద్, యూనిస్ ఖాన్ (32), మిస్బాహుల్ హక్ (37), యాసిర్ అరాఫత్ (25) రాణించారు.

తొలి వార్మప్ మ్యాచ్‌లో టీం ఇండియా న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ శుక్రవారం ప్రారంభం కానుంది. భారత్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడబోతుంది.

వెబ్దునియా పై చదవండి