చిట్స్ పేరుతో హైదరాబాదులో నిలువు దోపిడీ చేసిన తాపీ మేస్త్రీ, రూ. 70 కోట్లతో పరార్

ఐవీఆర్

గురువారం, 27 ఫిబ్రవరి 2025 (13:41 IST)
అధిక వడ్డీ వస్తుందంటే సహజంగానే ఆశపడుతుంటారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని ఓ తాపీ మేస్త్రీ రూ. 70 కోట్ల మేర టోపీ పెట్టేసి జంప్ అయ్యాడు. చిట్స్, అధిక వడ్డీలు పేరుతో ఎర వేసి చుట్టుపక్కల వారి నుంచి డబ్బులు రూ. 70 కోట్ల మేర లాగేసి ఆ తర్వాత సొమ్మును మూటగట్టుకుని కుటుంబ సభ్యులతో సహా రాత్రికిరాత్రి పరారయ్యాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఏపిలోని అనంతపురం జిల్లా గుత్తి మండలానికి చెందిన పుల్లయ్య తాపీ పని చేసి పొట్టపోసుకునేందుకు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ కి వచ్చాడు. ఈ క్రమంలో చుట్టపక్కలవారితో పాటు అతడు భవన నిర్మాణ పనులకు వెళ్లేవారితో పరిచయాలు పెంచుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని మెల్లగా చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. అతడిని నమ్మి పలువురు చిట్టీలు కట్టారు. తొలుత అందరికీ ఎలాంటి పొరబాటు లేకుండా డబ్బు ఇచ్చేసాడు. దాంతో అతడిపై మరింత నమ్మకం పెరిగింది.
 
ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాడు పుల్లయ్య. మీరు ఇచ్చే డబ్బుకి అధిక వడ్డీలు తెచ్చి పెడతానంటూ వ్యాపారం ఇంకాస్త పెంచాడు. వడ్డీ ఆశతో చాలామంది డబ్బులు ఇచ్చారు. అలా ఏడాది నుంచి వ్యాపారం చేస్తున్న ఇతగాడు ఏకంగా ఫార్చ్యూన్ కారు కొనేసి దర్జాగా తిరగడం మొదలుపెట్టాడు. పైగా జనం సొమ్ము ఏకంగా అతడి వద్దకు రూ. 70 కోట్లు చేరింది. ఇక ఇదే అదనుగా భావించి రాత్రికి రాత్రి ఫార్చూన్ కారును అక్కడే వదిలేసి దొంగదారిలో సొమ్మంతా మూటగట్టుకుని పరారయ్యాడు. ఫిబ్రవరి 23 నుంచి పుల్లయ్య, అతడి కుటుంబ సభ్యులు ఆచూకి లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు