తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నరుగా సీపీ రాధాకృష్ణన్

ఠాగూర్

మంగళవారం, 19 మార్చి 2024 (12:00 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా కేటాయించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తమిళిసై హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానని చెప్పారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టు చెప్పారు. పైగా తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినేనని, తెలంగాణాను వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని చెప్పారు. 
 
మరోవైపు, లోక్ సభ ఎన్నికలలో ఆమె బీజేపీ తరపున తమిళనాడులో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఇపుడు ఈ రెండింటికి రాజీనామా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు