తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుందని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణం కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని, హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.