బెన్ఫిట్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని చనిపోవడం ఆ చిత్ర హీరో చేతుల్లో ఉండకపోవచ్చని, కానీ ఆ అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం లేదా పట్టించుకోకపోవడం అనేది ఎవరి చేతుల్లో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ ఓ నిందితుడుగా ఉన్నారు.
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ను ఓ ఆంగ్లమీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సీఎం స్పందిస్తూ... రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని, అయినా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారని తెలిపారు.
అందుకే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోసేశారన్నారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయినట్లు చెప్పారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన (అల్లు అర్జున్) చేతుల్లో లేకపోవచ్చు కానీ... ఆ మహిళ కుటుంబాన్ని 10 - 12 రోజులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ... అల్లు అర్జున్‌ను ఎందుకు అరెస్టు నేపథ్యం, పూర్తి వివరాలు చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చన్నారు.
మరోవైపు, తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ డ్రైపోర్టును సమీపంలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు.
ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని కోరారు.