గ్రేటర్ బల్దియాలోని 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. ఈ నెల 24 నాటికి అర్హుల ఎంపికను పూర్తిచేసి, 25న నివేదికను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులను ప్రభుత్వం వద్దనున్న సమాచారంతో సరిచూసి, 26 నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్టు సమాచారం.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గ్రేటర్ 22 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేసింది. అందులో రేషన్ కార్డు లేదని, కొత్త కార్డు కావాలనే అభ్యర్థనలు అందాయి. పరిశీలన అనంతరం 83,285గా లెక్క తేల్చింది. ఇటీవల ఇంటింటి సర్వేలోనూ అనేక మంది రేషన్ కార్డులు లేనివారు వివరాలు నమోదు చేయించుకున్నారు.
కొన్నేళ్లుగా కొత్తకార్డులు ఇవ్వకపోవడం, జన్మించిన శిశువులు, కొత్తగా వచ్చిన కోడళ్ల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలంటూ వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే అంశంపై రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడవచ్చు.